కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి మరోతీపికబురు దక్కింది. కుత్బుల్లాపూర్‌కు BRTS ప్రాజెక్ట్ కేటాయిస్తూ మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖా మంత్రి శ్రీ కేటిఆర్, రవాణామంత్రి శ్రీ పట్నం మహేందర్ రెడ్డి లను కలసి, BRTS సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయించవలసిందిగా కోరారు. దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ నుండి అమీర్ పేట్ మెట్రో స్టేషన్ వరకు BRTS ఏర్పాటు చేయాల్సిందిగా కేపి వివేకానంద కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి శ్రీ కేటిఆర్ గారు, వెంటనే దీనిపై అధ్యయనం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. రవాణామంత్రి శ్రీ మహేందర్ రెడ్డి దేశంలో అత్యుత్తమ BRTS వ్యవస్థ ఉన్న అహ్మదాబాద్ నగరాన్ని సందర్శించి, అధ్యయనం చేస్తామని తెలిపారు.
వివరాల్లోకి వెళితే…కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో నివసించే వారిలో అత్యధికులు ప్రైవేట్ ఉద్యోగులు, కార్మికులు. ఒక్కొకరు తమ డ్యూటీకి వెళ్లి తిరిగి రావడానికి కనీసం ఒక గంట సమయం పడుతోంది. అయితే, సిటీ బస్సులు ఆటోలు తప్ప ఈ నియోజకవర్గంలో మరో ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీ బస్సులలో ప్రయాణించే వారి సమస్యలు తెలుసుకునేందుకు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గతంలో స్వయంగా మూడు రోజులు సిటీ బస్సులలో అసెంబ్లీకి వెళ్లారు. ఈ అనుభవంతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకి మెరుగైన ప్రజారవాణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని వివేకానంద తీవ్రంగా ఆలోచించారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉన్న ఇక్కడ మెట్రో రైల్ సాధ్యపడదు. ఎంఎంటీఎస్‌కు అవకాశం లేదు. ఇక బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం BRTS మాత్రమే, ప్రజల అవసరాలు తీర్చుతుందని గ్రహించిన వివేకానంద, ఈ దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టి మంత్రి కేటీఆర్‌కు విన్నవించగా ఆయన ఓకే చెప్పి అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు.
BRTS అంటే ఏంటి?
బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం ను క్లుప్తంగా BRTS అని పిలుస్తారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా రోడ్డు మధ్యలో బస్సులకోసం ఒక ప్రత్యేకమైన లేన్ ని ఏర్పాటు చేస్తారు. దీనికోసం ప్రత్యేకమైన బస్సులని డిజైన్ చేస్తారు. సాధారణ సిటీ బస్సులతో పోలిస్తే ఈ బస్సులలోకి చాలా త్వరగా ఎక్కొచ్చు, దిగొచ్చు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కూడా ఈ బస్సులకి ప్రాధాన్యత ఇస్తారు. ప్రయాణీకుల అవసరాలని బట్టి ఏసీ, నాన్ ఏసీ బస్సులు నడుపుకోవచ్చు. ట్రాఫిక్ జామ్స్ అయ్యే సమస్య ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ లో సగటు ప్రయాణ వేగం 14కిమీ, BRTS తో సగటు ప్రయాణ వేగం 28 కిమీ అవుతుంది. దీనితో ప్రజలకి, వేగవంతమైన, చవకైన, కాలుష్యం లేని ప్రయాణం సాధ్యపడుతుంది. భవిష్యత్తులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో జనాభా భారీగా పెరిగినా కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు ఉండవు.