కల్లు గీత కార్మికుల ఇబ్బందులు, సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి వారికి న్యాయం చేసేలా కృషి చేస్తానని ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కుల వృత్తులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, వాటిని ఈ రాష్ట్రంలో పునరుజ్జీవింప చేస్తుందని చెప్పారు. కల్లు గీస్తూ, తాటిచెట్టు మీద హార్ట్ అటాక్ తో చనిపోయిన మహబూబాబాద్ జిల్లా, గూడూరు కు చెందిన రాంపల్లి సాంబయ్య అనే గీత కార్మికుడి కుటుంబానికి 2 లక్షల రూపాయలను ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి అందించారు.
“గో ఫండ్ మీ” ఆన్లైన్ క్యాంపెన్ ద్వారా సారంగపాని, అతని మిత్రులు కలిసి సేకరించిన ఈ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు.
ప్రమాదకరం వృత్తుల్లో కల్లు గీత పని ఒకటని, దీనిద్వారా ఏటా మన రాష్ట్రంలో దాదాపు 250 మంది గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని టిఆర్ఎస్ వరంగల్ జిల్లా నేత సారంగపాని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కి తెలిపారు. వరంగల్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే ముగ్గురు చనిపోయారని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కుల వృత్తులకు మళ్ళీ జీవం పోస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారులకు రూ.1000 కోట్లు, గొర్రెలు, మేకల కాపరులకు 500 కోట్ల రూపాయలు కేటాయించారని తెలిపారు. ఇదే విధంగా కల్లు గీత కార్మికులు కోసం ప్రతి గ్రామంలో 10 ఎకరాల భూమి కేటాయించి అక్కడ ఎక్కువ ఎత్తు పెరగని హైబ్రిడ్ తాటిచెట్ల పెంపకానికి ప్రోత్సాహం ఇచ్చేలా ప్రభుత్వం సాయం చేయాలని కోరారు. దీనివల్ల 3 లక్షల కుటుంబాలకు జీవనాధారం స్థిరం అవుతుందని విజ్ఞప్తి చేసారు.