వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఆంధ్రప్రదేశ్లో మరో సరికొత్త చరిత్రను సృష్టించే దిశగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పాదయాత్రను పూర్తి చేసిన విషయం తెలిసిందే. వాన, ఎండ, చలిని సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న జగన్ వెంట తాము కూడా అంటూ ప్రజలు పాదయాత్రలో నడుస్తున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్య నారాయణ గురువారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు 2014లో ముఖ్యమంత్రి అయినప్పట్నుంచి రాష్ట్రంలో అవినీతి పేట్రేగి పోయిందని, ప్రజా సంక్షేమాన్ని మరిచిన సీఎం చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల పేరుతో బంధు ప్రతీని చూపిస్తున్నారన్నారు. టీడీపీ పాలనలో సామాజిక న్యాయం లేకుండా పోయిందని, రాష్ట్రాన్ని చంద్రబాబు సగం, టీడీపీ నేతలకు సంగం అన్నట్టుగా దోచుకుంటున్నారని బొత్స సత్యనారాయణ ఫైరయ్యారు.
అయితే, ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు మంచి ఆదరణ లభిస్తుందని, జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వారి సమస్యలను జగన్కు చెప్పుకునేందుకు ప్రజలు అశేష సంఖ్యలో పాదయాత్రలో పాల్గొంటున్నారని, వైఎస్ జగన్ ప్రజ సంకల్ప యాత్ర పేరుతో చేస్తున్న పాదయాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు టీడీపీ ఛాప్టర్ క్లోజ్ కావడం ఖాయమని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.