విద్యతోనే అట్టడుగు వర్గాల అభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ బలంగా నమ్ముతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారానే మొదట కేజీ టు పీజీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి సూచించారని గుర్తుచేశారు.ఎస్సీ అభివృద్ధి శాఖలోని డీఎస్సీడీఓ, ఎఎస్ డబ్ల్యు, సూపరింటెండెంట్ లకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో రెండు రోజులపాటు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇవాళ జరిగిన ముగింపు సమావేశంలో మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రభుత్వ విద్యాలయాల్లో అడ్మిషన్ల సంఖ్య, ఫలితాలు గణనీయంగా పెరిగాయని జగదీశ్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వ దవాఖానల పట్ల ఏ విధమైన విశ్వాసం వచ్చిందో, ప్రభుత్వ విద్యాలయాల మీద కూడా అలాంటి నమ్మకం వచ్చిందన్నారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేయాలని కోరారు.తెలంగాణ రాష్ట్రం వస్తే ఏమొస్తుందని ఎద్దేవా చేసినవాళ్లకు చేతల ద్వారా సమాధానం చెప్పినమని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడే ఎస్సీల అభివృద్ధి కోసం కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఇప్పుడు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే ఆయనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.