ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రైతు బంధు , 24 గంటల ఉచిత విద్యుత్తు , రూ. 5 లక్షల ఉచిత భీమా వంటి పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమవుతున్నాయి . తెలంగాణ ప్రజా సంక్షేమ , అభివృద్ధి పథకాలు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరున్న ఏజెన్సీల ద్వారా ఆర్ధిక రంగ నిపుణలకు , పెట్టుబడిదారులకు పరిచయమవుతున్నాయి . ఏషియాలో మంచి పేరున్న సంస్థగా గుర్తింపు పొంది ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తూ అనేక దేశాల్లో కార్యాలయాలు కలిగి ఉన్న సి ఎల్ ఎస్ ఏ ( Credit Lyonnais securities Asia ) సంస్థ ఇటీవల భారత ప్రభుత్వం రైతుల పంటలకు కనీస మద్దతు ధరలను పెంచిన అంశంపై ఒక నివేదికను రూపొందించింది . ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించింది . ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మేలు కోరి అమలు చేస్తున్న రైతుబంధు , 24 గంటల ఉచిత విద్యుత్ , రూ 5 లక్షల ఉచిత బీమా సౌకర్యాన్ని ప్రముఖంగా పేర్కొన్నది . తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు కోసం రూ. 12000 కోట్లు కేటాయించిన విషయాన్ని , ఇన్సూరెన్స్ కోసం మరో రూ 1000 కోట్లు కేటాయించిన అంశాన్ని తన నివేదికలో వెల్లడించింది . రూ 5500 కోట్లు ఖర్చవుతున్న ఉచిత విద్యుత్ ను కూడా వ్యవసాయ రంగానికి అందజేస్తున్నట్లు పేర్కొన్నది . ఆ నివేదికలో పేర్కొన్న అంశాలను బట్టి దేశంలో తెలంగాణ రాష్ట్రమే రైతుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్లుగా తెలుస్తున్నది . తెలంగాణ రైతుబంధు పథకాన్ని స్ఫూర్తిగా తీసుకొని కర్ణాటక ప్రభుత్వం కూడా “ రైత బెళకు “ అనే పథకానికి రూ 3500 కోట్లు ( ఆరుతడి పంటలు వేసుకునే రైతులకు మాత్రమే ) కేటాయించిందని సి ఎల్ ఎస్ ఏ తన నివేదికలో ప్రముఖంగా ప్రస్తావించింది . ఈ సంస్థ రూపొందించిన నివేదికలు అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వ , కార్పొరేట్ సంస్థలకు , పెట్టుబడిదారులకు వెళతాయి . ఇలాంటి నివేదికలను ఆధారం చేసుకుని వ్యవసాయ , ఆర్ధిక , విద్యుత్తు , శాంతిభద్రతలు , రాజకీయ స్థిరత్వం , భౌగోళిక వాతావరణ పరిస్థితులు అన్నింటినీ పరిగణన లోకి తీసుకొని కార్పొరేట్ కంపెనీలు తమ పెట్టుబడులను పెట్టడానికి ముందుకువస్తాయి . ముఖ్యంగా రైతుల సంక్షేమానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకోవడమే కాకుండా వారి కొనుగోలు శక్తి కూడా పెరుగుతుందని ఈ కంపెనీలు అంచనా వేస్తాయి . సి ఎల్ ఎస్ ఏ సంస్థ వంటి నివేదికల్లో తెలంగాణ రైతు పథకాల గురించి ప్రస్తావించడం మొత్తం వ్యవసాయరంగానికి చాలా మేలు చేస్తుందని వ్యవసాయ రంగ నిపుణులు పేర్కొంటున్నరు . తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి అంతర్జాతీయ పెట్టుబడిదారులు ముందుకు వచ్చే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నరు . మరో విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుని కర్ణాటక లాగా ఇతర రాష్ట్రాలు తమ రైతుల కోసం ఇలాంటి మంచి పథకాల ప్రారంభానికి ప్రయత్నిస్తాయని వ్యవసాయ రంగ విశ్లేషకులు పేర్కొంటున్నరు . ఏమైనా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశం కావడం తెలంగాణకు గర్వకారణమనే చెప్పాలి.