ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పెరవల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ కలిసింది.
అయితే, ఒక్క ప్రమాదం బాధితుడి జాతకాన్నే కాదు.. కుటుంబ తలరాతనే మార్చేస్తుంది. ప్రమాదంలో గాయపడి జీవితాంతం వికలాంగుడిగా ఉండేటటువంటి వారి పరిస్థితి గురించి ఇక చెప్పనక్కర్లేదు. వారికిక నరకమే. అటువంటి నరకాన్నే అనుభవిస్తున్నాడు ఓ లారీ డ్రైవర్. అసలు ఆ ప్రమాదంలో అతడి ప్రాణాలే పోయి ఉండేవి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజల సంక్షేమం కోసం తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ అతడి ప్రాణాలను కాపాడింది.
ఆ తరువాత వైఎస్ఆర్ చనిపోవడం, ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో ఆ లారీ డ్రైవర్ జీవితమంతా గతుకులమయమైపోయింది. తనను ఆదుకోవాలంటూ, తనలాంటి కుటుంబాలను ఆదుకోవాలని పాదయాత్రలో ఉన్నవైఎస్ జగన్‌ను కోరారు. పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసిన వ్యక్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం పెరవల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ అనే దివ్యాంగుడు.