ఈ నెల 4వ తేదీన వరంగల్ జిల్లా కోటి లింగాల వద్ద భద్రకాళి ఫైర్ వర్క్స్ లో జరిగిన భయానక అగ్నిప్రమాదంలో గాయపడి, నిమ్స్ లో చికిత్స పొందుతున్న సురేష్ ను ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేడు దవాఖానాకు వెళ్లి పరామర్శించారు. ఆయనకు జరుగుతున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని ఖర్చులు భరిస్తామని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రకటించిన నేపథ్యంలో సురేష్ చికిత్స విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం ఉండకూడదని నిమ్స్ అధికారులు, డాక్టర్లకు సూచించారు. సురేష్ కోలుకునే విధంగా చేయడం ప్రభుత్వ బాధ్యతని, దీనికి డాక్టర్లు సహకరించి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సురేష్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని సూచించారు. అదేవిధంగా జనగామ జిల్లా, దేవరుప్పల మండలం, మాదాపూర్ కు చెందిన జయశంకర్ బస్సు ప్రమాదంలో గాయపడి అక్కడే వైద్యం తీసుకుంటుండగా ఆయనను కూడా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పరామర్శించారు. ఆయనకు అయ్యే ఖర్చులను సిఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
