శనీశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. నవ గ్రహాల్లో అతి శక్తివంతుడు, ప్రభావశాలి శనీశ్వరుడు. శనీశ్వరుడు మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. మకర, కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞాదేవి. ఆమె సంతానం శ్రాద్ధదేవుడు, యముడు, యమున. సంజ్ఞ సూర్యతేజాన్ని భరించలేక తన నుంచి ఛాయను సృష్టించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయిందట. చాయకు,సూర్యుడికి శ్రావణుడు, శనీశ్వరుడు జన్మించారు.
శనీశ్వరుడు గురించి పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణాల్లో విభిన్న విషయాలను వివరిస్తున్నాయి. శని మందగమనం కలవాడు గనుక మందడు అంటారు. ఇతని వాహనం కాకి. నలుపు, నీలి వర్ణాలు శనీశ్వరునికి ఇష్టమైన రంగులు. జిల్లేడాకులు, తైలాభిషేకం ఇష్టం. శనీశ్వరుని భార్య జ్యేష్టాదేవి. సర్వ జీవరాశిని సత్య మార్గంలో నడిపించడానికి శనీశ్వరుడు అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. దాన, ధర్మాలతో సత్య మార్గాలను ఆచరిస్తూ పవిత్రంగా మానవ ధర్మాన్ని పాటించే వారికి శనీశ్వరుడు ఎల్లప్పుడూ అండగా ఉండి, శుభాలను కలిగిస్తాడని, అకారణంగా ఎవరినీ బాధించడని పురాణాలు వివరిస్తున్నాయి. శని బాధలు ఆయా మానవుల పూర్వ కర్మల ఫలాలే. వారి వారి కర్మలను అనుసరించి.. ఆయా వ్యక్తులను ప్రేరేపించి వారిని ఆ కర్మఫలితాలనుంచి సిద్ధింప చేస్తాడట. శనీశ్వర ధూషణ సర్వ దేవతా ధూషణ. శని కృప..సకల దైవాల కృపతో సమానమట. దశరధుడు, నలమహారాజు, ధర్మరాజు మొదలైన వారు కష్టాల్లో శనిని పూజించి భక్తితో తరించారని పురాణాలు వెల్లడిస్తున్నాయి. లోహమయమైన శని ప్రతిమను తైలంగల పాత్రలో ఉంచి నల్లని వస్త్రాలను కప్పి గ్రంధం, నీలి పుష్కాలతో పూజించి ప్రతిమను దానం చేయాలి. పురాణాల్లో పేర్కొన్న శనిదశనామాలను రావిచెట్టు వద్ద జపిస్తే.. శని బాధ కలగదని విశ్వాసం.