నల్లగొండ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుభవార్త తెలిపారు.జిల్లాలోని నకిరేకల్‌లో ఆహారశుద్ధి పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు .ఈ రోజు హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్లో నకిరేకల్ పట్టణానికి చెందిన పలు పార్టీల నేతలు, కార్యకర్తలు ప్రస్తుత అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరందరికి మంత్రి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలో ఆహ్వానించారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై కమిట్‌మెంట్ ఉన్న పార్టీ టీఆర్‌ఎస్ అన్నారు.55 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో నల్లగొండ జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ బీమా కల్పించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదన్నారు. రైతులకు రూ. 17 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఆయన పేర్కొన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.