సూర్యుడు తూరుపునే ఉదయిస్తాడు అన్ని ఎంత సత్యమో.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నది కూడా అంతే సత్యమని ఆ పార్టీ కురపాం నియోజకవర్గం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి అన్నారు. కాగా, సోమవారం విజయనగరం జిల్లాలో జరిగిన చెరుకు రైతుల ధర్నాలో ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ.. చంద్రబాబు సర్కార్ చెరుకు రైతులకు చేస్తున్న అన్యాయాలపై ప్రశ్నించారు.
రైతు పంట పండిస్తేనే ప్రపంచంలో మానవుడు మనుగడ సాధించగలుగుతాడు.. అటువంటి రైతుకు చంద్రబాబు సర్కార్ చేస్తున్నదేమిటి..? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగానే విజయనగరం జిల్లాలో చెరుకురైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.11 కోట్ల బకాయిలను గుర్తు చేశారు. విదేశాల్లో పర్యటనలంటూ ఇప్పటి వరకు 200 కోట్లు ఖర్చుపెట్టిన మీకు.. విజయనగరం చెరుకు రైతులకు చెల్లించేందుకు రూ.11 కోట్లు లేవా..? సరదాగా సేదతీరడానికి హై టెక్ బస్సులంటూ రూ.10 కోట్లు ఖర్చుపెట్టిన నీవు.. విజయనగరం చెరుకు రైతులకు చెల్లించేందుకు రూ.11 కోట్లు లేవా..? గోదావరి, కృష్ణా పుష్కరాలపేరుతో వేలకోట్ల రూపాయల ధనాన్ని ఖర్చు చేసిన నీవు.. విజయనగరం చెరుకు రైతులకు చెల్లించేందుకు రూ.11 కోట్లు లేవా..? ఆఖరకు నీ కుమారుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌కు తెలుగు నేర్పించేందుకు సంవత్సరానికి రూ.2 కోట్లు వంతునైదు సంవత్సరాలకు రూ.10 కోట్లు ఖర్చు పెడుతున్న నీవు.. విజయనగరం చెరుకు రైతులకు చెల్లించేందుకు రూ.11 కోట్లు లేవా..? అని సీఎం చంద్రబాబుకు సూటి ప్రశ్నలు సంధించారు.