వివాదస్పద చర్యలతో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తున్న కత్తి మహేష్‌ను హైదరాబాద్ నుంచి బహిష్కరిస్తూ పోలీసులు నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై వివిధ పార్టీలు స్పందించగా తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ రియాక్టయ్యారు. కత్తిమహేష్ రాష్ట్ర పోలీసు యంత్రాంగం తీసుకున్న చర్య అభినందనీయమని, డీజీపీ నిర్ణయాన్ని టీఆర్ఎస్ శాసనసభా పక్షం స్వాగతిస్తున్నదని కర్నె తెలిపారు. ఒక్క మహేష్ మాత్రమే కాదు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులు ఎవరైనా ఇలాంటి చర్యలే తీసుకునేలా పోలీసులు ముందుకు పోతుండటాన్ని ప్రజలు హర్షిస్తున్నారన్నారు. సమాజంలో అలజడులు సృష్టించే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న మహేందర్‌రెడ్డిని ఆయన అభినందించారు.
ఉమ్మడి రాష్ట్రంలో శాంతిభద్రతలు గందరగోళంగా ఉండేవని, ఒక నాయకుడిని గద్దె దించడానికి, మరో నాయకుడిని గద్దెనెక్కించడానికి హైదరాబాద్ నగరంలో మతకలహాలు సృష్టించి రాక్షసంగా వ్యవహరించారని ఎమ్మెల్సీ కర్నె తెలిపారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి తరువాత శాంతిభద్రతలు బాగా ఉండాలని ప్రభుత్వం చర్యలు తీసుకుందని, పోలీసులు సమర్ధవంతంగా పని చేస్తున్నారని ,ఫలితంగా హైదరాబాద్ ప్రశాంత వాతావరణంలో స్వేచ్చగా జీవించే వీలున్న అద్భుత నగరమని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నాలుగేండ్లుగా సంతోషంతో ఉన్నారని చెప్పారు. మీడియా సంస్థలు కూడా స్వీయ నియంత్రణ పాటించి వివాదస్పద వ్యాఖ్యలతో సమాజంలో అలజడి సృష్టించే విధంగా వ్యవహరిస్తున్న బాధ్యత లేని వ్యక్తులకు అనవసర ప్రచారం కలిపించవద్దని కర్నె ప్రభాకర్ సూచించారు.