ప్రపంచ కుబేరుల జాబితాలో ఫేస్‌బుక్ సీఈవో జుకర్ బర్గ్‌కు మూడో స్థానం దక్కింది. కాగా, శుక్రవారం లెక్కల ప్రకారం ఫేస్‌బుక్ షేర్లు స్టాక్ మార్కెటలలో 2.4శాతం పెరిగాయి. అంతకు ముందు నాలుగో స్థానంలో ఉన్న జుకర్ బర్గ్ ఫేస్‌బుక్ షేర్లు 2.4 శాతం పెరగడంతో మూడో స్థానంలో ఉన్న బెర్కషైర్ హాథవే సీఈవో వారెన్ బఫెట్‌ను అధిగమించాడు. దీంతో జుకర్ బర్గ ప్రపంచంలోని అత్యంత ధనవంతుల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడని బ్లూమ్‌బర్గ్ ఒక నివేదికలో వెల్లడించింది. అయితే, మొదటి స్థానాల్లో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, రెండో స్థానంలో మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు.
మరోపక్క సోషల్ మీడియా రంగంలో ఫేస్‌బుక్ దినదినాభివృద్ధి చెందుతు ముందుకు పోతోంది. ఫేస్‌బుక్ నుంచి యూజర్ల ఖాతాలో గోప్యంగా ఉన్న డేటా కూడా చోరీకి గురి అవుతుందని ఆధారాలతో సహా నిరూపితమైనప్పటికీ.. ఫేస్‌బుక్ వ్యాపార రంగానికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగకపోవడం గమనార్హం. అంతేకాక, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్ ప్రాంతాల్లో $ 264 మిలియన్ల విలువైన ఒప్పందంతో ఫేస్‌బుక్ ప్రత్యేక హక్కులను పొందిందని ది టైమ్స్ పత్రిక పేర్కొంది. ఈ ఒప్పందం 2019 నుండి 2022 వరకు అమలు కానుంది.