ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైసీపీ అధ్యక్షులు, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను మండపేట నియోజకవర్గం గిరిజనులు కలిశారు. చంద్రబాబు సర్కార్ తమపై చూపుతున్న వివక్షతను, ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో సామరస్యంగా వారి సమస్యలను విన్న జగన్.. సమస్యల పరిష్కారాఇనకి తానున్నాన్న భరోసాను గిరిజనుల్లో కల్పిస్తూ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నారు.
కాగా, మండపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను ఇవాళ మస్కట్‌లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ఇమ్మాన్యుయేల్ కుటుంబం కలిసింది. అనంతరం ఇమ్మాన్యుయేల్ మీడియాతో మాట్లాడుతూ..మస్కట్‌లో తాను ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేస్తున్నట్టు తెలిపాడు. జగన్ పాదయాత్రలో భాగంగా తమ నియోజకవర్గానికి వస్తున్నాడని తెలుసుకుని.. వెంటనే మస్కట్ నుంచి జగన్‌ను కలుసుకునేందుకు వచ్చామని చెప్పారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ కోసం తనవంతుగా ప్రచారం చేస్తానని, జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలే వైసీపీని గెలిపిస్తాయని చెప్పారు.
అలాగే, ఇమ్మాన్యుయేల్ కుమార్తెలు మాట్లాడుతూ.. మస్కట్‌లోని ఓ ఇండియన్ స్కూల్లో తాము చదువుకుంటున్నట్టు తెలిపారు. తమ ఫ్రెండ్స్‌తో ఏపీ గురించి చర్చ వచ్చినప్పుడల్లా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిని, ఆయన పేద ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించే చెప్తామన్నారు. వైఎస్ఆర్ పాలన గురించి ఎంతో గొప్పగా చెప్తామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని ప్రతీ పేదవారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. వైఎస్ జగన్ ఆరోగ్యంగా ఉండాలని.. దైవాన్ని నిత్యం ప్రార్థిస్తామని వారు మీడియాతో చెప్పడం గమనార్హం.