అనంతపురం జిల్లా వ్యాప్తంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 69వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వైసీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా మాజీ ఎంపీ వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ఆర్ ఆశయాలను కొనసాగించడం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కే సాధ్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా గౌరవింపపడే నేత ఒక్క వైఎస్ఆర్ అని ఆయన అన్నారు. వైఎస్ఆర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రతీ పేదవాడికి అందాయని, ఆ క్రమంలోనే వైఎస్ఆర్ ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచారన్నారు. వైఎస్ఆర్ పరిపాలన, ప్రతీ పేదవారికి న్యాయం జరగాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు.