రాజకీయంగా పెను మార్పులకు కేంద్ర బిందువైన ఆంధ్రప్రదేశ్ మరో సారి కొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తోంది. నైతికత, నిబద్ధత, చిత్తశుద్ధి ఈ మూడు విలువల ఆధారంగా పాదయాత్రను ప్రారంభించిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్.. ఒకటి కాదు.. రెండు కాదు ఇప్పటి వరకు 206 రోజుల పాదయాత్రను పూర్తి చేశారు. ప్రజల సమస్యలపై తన పోరాటం ఇంకా ఆగలేదని వైఎస్ జగన్ పాదయాత్రను ఇంకా కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ కొన్ని లక్షల మందిని నేరుగాను, కోట్లాది మందిని పరోక్షంగాను కలుసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో మాజీ మంత్రి, టీడీపీ నేత ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరబోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ సోషల్ మీడియా సరికొత్త కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం విశ్లేషణ ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
ఇక అసలు విషయానికొస్తే సీఎం చంద్రబాబు తనకు ప్రభుత్వంలో కీలక పదవి, తన సోదరుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని ఇచ్చిన హామీతో ఆనం సోదరులు రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రోజులు గడిచినా.. వారికి మాత్రం ఎటువంటి పదవులు రాకపోగా.. సీఎం చంద్రబాబు ఎటువంటి భరోసా కల్పించలేదు. ఈ క్రమంలో ఆనం వివేకానందరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే.
పై రాజకీయ పరిణామాలన్నిటి దృష్ట్యా ఆనం రామనారాయణరెడ్డి టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. గతంలో నెల్లూరు జిల్లాలో తన మాట చెల్లుబాటు అయ్యేదని, టీడీపీలో చేరినప్పట్నుంచి తన మాట చెల్లుబాటు కావడం లేదంటూ రామనారాయణరెడ్డి బహిరంగ విమర్శలు కూడా చేశారు. ఇలా టీడీపీలోని ఇతర నేతలతో పడనాని మాటలు పడటం ఇష్టంలేని ఆనం రామనారాయణరెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఆ క్రమంలోనే వైసీపీ నేతలతో మంతనాలు జరిపారని సమాచారం.
ఈ సమాచారాన్ని వైసీపీ నేతలు వైఎస్ జగన్‌కు చేరవేయడంతో.. సమాచారం తెలుసుకున్న వైఎస్ జగన్ ఆనం రామనారాయణరెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారట. అంతేకాకుండా, వైసీపీలో కీలక పదవిని కూడా వైఎస్ జగన్ ఆనం రామనారాయణరెడ్డికి ఆఫర్ చేసినట్టు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మంత్రి నారాలోకేష్ ఆనం రామ నారాయణరెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పకముందే వేటు వేసేందుకు సిద్ధమయ్యారట.