251 రూపాయిలకే స్మార్ట్‌ఫోన్ అంటూ.. రింగింగ్ బెల్స్ సంస్థ ఫ్రీడం 251 ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. మోస్ట్ అఫార్డబుల్ స్మార్ట్‌ఫోన్‌గా పెను సంచలనానికి దారితీసిన ఈ కంపెనీ, డివైజ్‌లను ఎంతమందికి అందించన్నది అసలు లెక్కలే లేవు. చివరికి ఆ స్మార్ట్‌ఫోన్ సూత్రధారి మోహత్ గోయలే జైలు పాలయ్యాడు. ఇక 251 రూపాయల స్మార్ట్‌ఫోన్ గురించి మరచిపోవాల్సిందేనని వినియోగదారులు భావిస్తూ ఉంటే… తాజాగా మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ అత్యంత చౌకగా కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తానంటూ టీజ్ చేస్తోంది. అత్యంత చౌకగా కేవలం రూపాయికే..! సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేయనున్నామని దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ చెబుతోంది. అత్యంత తక్కువగా రూపాయికే కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తామంటూ కంపెనీ టీజర్ కూడా విడుదల చేసింది. లేదా ఉచితంగానైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందించనున్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. జూలై 5న కంపెనీ ఈ టీజర్‌ను షేర్‌చేసింది.
అంటే వచ్చే వారాల్లోనే ఈ స్మార్ట్‌ఫోన్ చెన్నై వాసుల ముందుకు తీసుకురాబోతుందని తెలుస్తోంది.
అయితే ఈ ఆఫర్ జియోఫోన్ మాదిరి ఉండొచ్చని టెక్ వర్గాలంటున్నాయి. జియోఫోన్ కూడా పూర్తిగా జీరోకే కంపెనీ ఆఫర్ చేస్తోంది. కానీ తొలుత ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు వినియోగదారులు సెక్యురిటీ డిపాజిట్ కింద 1500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ అనంతరం ఆ మొత్తాన్ని రిలయన్స్ జియో రీఫండ్ చేయనుంది. అదే మాదిరి ఈ కంపెనీ కూడా రూపాయికే మైక్రోమ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ చేస్తుందని అంటున్నారు. అయితే యూజర్లు ఈ స్మార్ట్‌ఫోన్ పొందడం కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుందని, ఆ అనంతరం ఆ మొత్తాన్ని టెలికాం ప్రొవైడర్లతో లింక్ అయి డేటా, వాయిస్ కాల్స్ రూపంలో అందిస్తుందని చెబుతున్నారు. లేదా రూపాయికే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను నిజంగానే లాంచ్ చేసి, లిమిటెడ్ మొత్తంలో మార్కెట్‌లోకి అందుబాటులో ఉంచనున్నారని తెలుస్తోంది. అయితే ఏ విధంగా రూపాయికి స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తుందో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని టెక్ వర్గాలు అంటున్నాయి.