ఉపాధి కోసం ఊరు వదిలి వలసలు వెళ్లడం& ఉపాధి లేక కార్మికులు ఉరితాళ్లను ఆశ్రయించడం సిరిసిల్ల గత చరిత్ర. కార్మికులు చేతినిండా పనితో ఉక్కిరి బిక్కిరి కావడం& ఉపాధి కోసం ఈ ప్రాంతానికే వలసలు రావడం సిరిసిల్ల ప్రస్తుత పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నిత్యం ఒడుదుడుకుల్లో కూరుకుపోయిన సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత మూడేళ్లుగా ప్రభు త్వం చేయూతనిస్తుండగా, కార్మికులకు బతుకమ్మ చీరల ఆర్డర్ బాసటగా నిలుస్తున్నది. ఫలితంగా ఉపాధి కరువైన స్థితి నుంచి ఉపాధిని కల్పించే స్థాయికి సిరిసిల్ల ఎదిగింది. సిరిసిల్లను ‘ఉరిసిల్ల’గా పిలిచే రోజులు పోయి ‘సిరులసిల్ల’ గా భావించే రోజులు వచ్చాయి. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు ఉపయోగపడే వస్త్రాన్ని సిరిసిల్లలోని పవర్‌లూమ్‌లపైనే తయారు చేయించడంతో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికుల దశ తిరిగింది. ఒక వైపు రాజీవ్ విద్యా మిషన్ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్‌ల తయారీ సిరిసిల్లలోనే చేపట్టడం, మరోవైపు బతుకమ్మ పండగ, క్రిస్‌మస్, రంజాన్ పండుగల సందర్భంగా ప్రభుత్వం కానుకలుగా ఇచ్చే దుస్తులను కూడా సిరిసిల్లలోనే ఉత్పత్తి చేయించడంతో అటు కార్మికులకు, ఇటు యజమానులు, ఆసాములు చేతినిండా పనితో ఆదాయం పొందుతున్నారు.
ము ఖ్యంగా ప్రతి ఏటా 90 లక్షల బతుకమ్మ చీరలను ప్రభు త్వం కొనుగోలు చేస్తుండడంతో కార్మికులు సంబురపడు తున్నారు. తద్వారా పవర్‌లూమ్‌లకు ఏడాదంతా పని కల్పించేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకున్నారు. పవర్‌లూం కార్మికులు కనీసం నెలకు రూ.15 వేల నుండి రూ.20 వేల ఆదాయం పొందే విధంగా చూస్తూ కనీస వేతనాలు అమలయ్యే విధంగా చేనేత, జౌళి శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం సిరిసిల్లలో భారీ అప్పెరల్ పార్‌్,ను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. టెక్స్‌టైల్ పార్క్‌లో సదుపాయాలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. గతంలో సిరిసిల్ల నుండి ముంబయి, సూరత్, గుజరాత్ తదితర ప్రాంతాలకు ఉపాధి కోసం వలసలు పోయిన కార్మికులు తిరిగి సిరిసిల్లకు రాగా, ప్రస్తుతం ముంబయి, సూరత్, గుజరాత్ తదితర ప్రాంతాల నుండి కార్మికులు ఉపాధి కోసం సిరిసిల్లకు వస్తుండడం గమనార్హం.బాసటగా నిలిచిన బతుకమ్మ చీరలు : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వేలాది మంది పవర్‌లూం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షల బతుకమ్మ చీరల తయారీ ఆర్డరిచ్చి ఉపాధి కల్పిస్తున్నది.
ఇంత పెద్ద సంఖ్యలో బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసేందుకు సిరిసిల్లలోని 20 వేల మరమగ్గాలు 4 నెలలు నిరంతరాయంగా పనిచేస్తేనే లక్షం నెరవేరుతుంది. ఈ సారి 95 లక్షల బతుకమ్మ చీరెల కోసం 80 రంగుల్లో 6 కోట్ల మీటర్ల గుడ్డను తయారు చేయాల్సి ఉంటుంది. పవర్‌లూం కార్మికులతో ఏర్పాటైన 104 మ్యాక్స్ సొసైటీలకు, 71 చిన్న తరహ పరిశ్రమలకు బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్‌ను అధికారులు అందించారు. నూలుదారాన్ని సబ్సిడిపై అందిస్తున్నారు. కార్మికులకు కూలీని మీటర్‌కు రూ.4.25 లుగా నిర్ణయించారు. దీంతో పవర్‌లూంలపై ఆధారపడిన అనుబంధ పరిశ్రమలు వార్పిన్, డయింగ్, సైజింగ్‌లు కూడా బిజీబిజీగా ఉంటున్నాయి. చేనేత జౌళిశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ సాగిస్తూ చీరెల ఉత్పత్తి సెప్టెంబర్ లోగా పూర్తి చేసేలా చూస్తున్నారు. పవర్ కార్మికులతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు కూడా ఉపాధి కల్పించాలని ఇటీవల మంత్రి కె.తారకరామారావు సంబంధిత అధికారులను ఆదేశించడం కార్మికుల ఆనందపడుతున్నారు.‘ఉరిసిల్ల’ నుంచి ‘సిరులసిల్ల’గా: సిరిసిల్లలో చేనేత మగ్గాల స్థానాన్ని క్రమంగా పవర్‌లూంలు ఆక్రమించి గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో మొత్తం మూడంచెల వ్యవస్థ ఉంది.
పవర్‌లూంలపై వస్త్రోత్పత్తి చేసేందుకు మాస్టర్ వీవర్లు సొంతంగా పవర్‌లూంలను, ముడిసరుకైన నూలుదారాన్ని కొనుగోలు చేసి కార్మికులతో వస్త్రోత్పత్తి చేయిస్తున్నారు. ఆసాములు సొంతంగా పవర్‌లూంలను కొనుగోలుచేసి మాస్టర్ వీవర్స్ వద్ద ముడిసరుకులు తెచ్చి, కార్మికులతో వస్త్రాలు తయారు చేయించి తమకు, కార్మికులకు కూలీని యజమానుల నుండి పొందుతారు. కార్మికులు యజమానుల వద్దగాని, ఆసాముల వద్దగాని పనిచేస్తారు. గతంలో ముడిసరుకుల ధరల హెచ్చుతగ్గులు, కరెంట్ చార్జీలు పెరగడం, ఉత్పత్తయిన గుడ్డకు సరైన మార్కెట్ లేకపోవడం తదితర కారణాల వల్ల సిరిసిల్లలో వస్త్రోత్పత్తి నియిచిపోయిన సందర్భాల్లో కార్మికులు, ఆసాములు, కొన్ని సందర్భాల్లో యజమానులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి సిరిసిల్లలో ఉండేది. ఫలితంగా ‘సిరిసిల్ల’ను దశాబ్ద కాలం వరకు ‘ఉరిసిల్ల’గా పిలిచేవారు. రోజుకో పవర్‌లూం వర్కర్ ఆత్మహత్య వెలుగుచూసే దశ నుండి ప్రభుత్వం తీసుకున్న అనేక సహయ చర్యల వల్ల నేడు అత్మహత్యలు కనపడకుండా పోయాయి. సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమ అభివృద్ధితో ‘ఉరిసిల్ల’గా పిలిచే పరిస్థితి నుంచి క్రమంగా ‘సిరులసిల్ల’గా మారుతున్నదని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృధ్ధికి మంత్రి కెటిఆర్ తీసుకుంటున్న చర్యలు పరిశ్రమ వర్గాలవారి మన్ననలు అందుకుంటోంది. కెటిఆర్ ప్రత్యేక దృష్టితో సిరిసిల్ల పవర్‌లూం పరిశ్రమ కష్టాలు తీరాయనడంలో అతిశయోక్తి లేదు. —-
వస్త్రోత్పత్తి వల్ల ఉపాధిని, ఆదాయాన్ని పొందుతున్నాం : వెంగళ ప్రసాద్, మార్కండేయ వీధి, సిరిసిల్ల.
ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బతుకమ్మ చీరల తయారీ వల్ల ఉపాధిని, ఆదాయాన్ని పొందుతున్నాం. గత 20 సంవత్సరాలుగా వస్త్రోత్పత్తి చేస్తున్నాను. గతంలో రూ.2 వేల నుంచి రూ.2500 లను ఒక వారానికి కూలీగా సంపాదించుకోగా ప్రస్తుతం బతుకమ్మ చీరల వల్ల వారానికి రూ.3 వేల నుండి రూ.3500 వరకు సంపాదించుకుంటున్నాం. అయితే బతుకమ్మ చీరలకు నల్ల రంగు దారం, జరీ ఉండడం వల్ల గతంలో కంటే కొంత ఇబ్బంది కలుగుతుంది…
24 గంటలూ పరిశ్రమ నడుస్తుంది : వస్త్రోత్పత్తికి ప్రభుత్వ ప్రొత్సాహం లభించినప్పటి నుంచి 24 పవర్‌లూంలను నడిపించుకుంటున్నాం. ప్రతి పవర్‌లూంపై రోజుకు 60 మీటర్ల బతుకమ్మ చీరల గుడ్డను ఉత్పత్తి చేస్తున్నాం. దీని వల్ల మీటర్‌కు రెండు రూపాయల అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో పాలిస్టర్ గుడ్డను ఉత్పత్తి చేయడం వల్ల ఆశించిన లాభం కలగలేదని, బతుకమ్మ చీరల వల్ల ప్రతి రోజు ఆదాయాన్ని కళ్ల చూస్తున్నాం.
శ్రీరాం విష్ణు, ఎస్‌వి టెక్స్‌టైల్స్ యజమాని, ప్రగతి సొసైటీ చైర్మన్, గాంధీనగర్, సిరిసిల్ల.