వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 205వ రోజుకు చేరుకుంది. కాగా, ఇడుపులపాయ నుంచి పాదయాత్రను ప్రారంభించిన జగన్ ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో తన పూర్తి చేశాడు. ప్రస్తుతం పదో జిల్లాగా తూర్పు గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ.. తానున్నానన్న భరోసాను వారికి కల్పిస్తూ జగన్ ముందుకు కదులుతున్నారు.
ఇదిలా ఉండగా, అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, అందుకు సంబంధించి వైసీపీ నేతలతో చర్చలు కూడా పూర్తయ్యాయంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంతకీ ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎవరు..? చంద్రబాబుకు, తనకు మధ్య వచ్చిన విభేదాలు ఏమిటి..? ఆ ఎమ్మెల్యే వైసీపీలో చేరిక ముహూర్తం ఎప్పుడు.? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
ఇక అసలు విషయానికొస్తే.. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డిపై అతనంటే గిట్టని ఆ పార్టీ వర్గమే సీఎం చంద్రబాబుకు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారట. పోలంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి గతంలో కాంగ్రెస్ వాది అయినందున.. ఇప్పుడు కూడా ఆ పార్టీ వారితో టచ్‌లో ఉంటూ.. వారికే అధికారిక పనులు చేస్తున్నారని పోలంరెడ్డి వ్యతిరేక వర్గం చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారట. అంతేకాకుండా, అధికారిక కార్యక్రమాల్లో తమను కలుపుకుపోకుండా, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లకుండా పోలంరెడ్డి టీడీపీ వర్గంపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుకు ఫిర్యాదులు అందాయట.
కోవూరు టీడీపీ నేతల నుంచి ఫిర్యాదులు అందుకున్న సీఎం చంద్రబాబు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోలంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డికి ఎమ్మెల్యే సీటు కేటాయించేందుకు విముఖత చూపుతున్నారని, ఈ నేపథ్యంలో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ఎమ్మెల్యే పోలంరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారట. అందులో భాగంగానే ఇప్పటికే పలు సంస్థలు నిర్వహించిన సర్వేల్లో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చేసిన నేపథ్యంలో.. పోలంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి కూడా వైసీపీలో చేరేందుకు సమాయత్తమయ్యారట. ఈ మేరకు వైసీపీ నేతలతో మంతనాలు కూడా జరిపారని సమాచారం. అయితే, ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి వైసీపీలో చేరే తేదీ ఖరారు కావాల్సి ఉంది.