కర్నాటకలోని ఆల్మట్టి డ్యాంను మథని ఎమ్మెల్యే పుట్ట మధు మంగళవారం సందర్శించారు. దేశంలోనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ గా రూపుదిద్దుకుంటున్న కాలేశ్వరం ప్రాజెక్ట్ పరిసరాలను ఆల్మట్టి తరహాలో అభివృద్ధి చేసేందుకు ఆల్మట్టి పరిసరాల్లో చేపట్టిన చర్యలను ఆయన పరిశీలించారు. కాలేశ్వరం – మేడిగడ్డ ప్రాజెక్ట్ ను పర్యాటక ప్రాంతంగా సైతం అభివృద్ధి పర్చడానికి ప్రాజెక్ట్ పరిసరాల్లో పార్క్ ఇతర సౌకర్యాల కల్పనకు చేపట్టే చర్యలకు సంబందించి వివిధ ప్రాజెక్ట్ ల వద్ద చేసిన ఏర్పాట్లను పరిశీలించి ఒక నివేదిక తయారు చేసి ముఖ్యమంత్రికి సమర్పింవడానికి అధ్యయనం చేస్తున్నారు.
అందులో భాగంగా ప్రాజెక్ట్ పరిసరాలను ఆయన నిశితంగా పరిశీలించి, అందుకు సంబందించిన పలు అంశాలపై డ్యాం అధికారులతో కూలంకశంగా చర్చించారు. బుధవారం, లేదా గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పూర్తిస్థాయి నివెదిక సమర్పించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతుండగా, స్థానిక ఎమ్మెల్యే పుట్ట మధు ఆ ప్రాజెక్ట్ ను పలురకాల హంగులతో పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.