తెలంగాణ రాష్ట్రంలో పౌర సరఫరాల సంస్థ రేషన్ డీలర్లు సమ్మె విరమించారు. రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చలు ఫలించడంతో సమ్మె విరమిస్తున్నట్టు వారు ప్రకటించారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాస ప్రాంగణంలో ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్-రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపారు.రేషన్ డీలర్ల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రి మీద గౌరవంతో సమ్మె విరమించినందుకు రేషన్ డీలర్లకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తరువాత రేషన్ డీలర్ల అనేక సమస్యలు పరిష్కరించామని గుర్తుచేశారు.సమస్య పరిష్కారానికి కృషి చేసిన డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.
