ఏపీని కేవలం నాలుగేళ్ల కాలంలోనే అవినీతాంధ్రప్రదేశ్‌గా మార్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది.. అవినీతికి కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు.. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబుకు మద్దతు ఇచ్చినందుకు ప్రజలు నన్ను క్షమించరని తెలుసు.. అయినా నేను చేసిన పొరపాటును సరిదిద్దుకునేందుకు మీ ముందుకు వచ్చా అంటూ టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాగా, ఇవాళ శ్రీకాకుళం జిల్లా ఎస్.కోటలో నిర్వహించిన జనసేన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇటీవల కాలంలో ఏపీ భవన్‌లో సమావేశమైన టీడీపీ ఎంపీలు ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌పై చేసిన వ్యాఖ్యలు తనను ఎంతో బాధించాయని, ఏ ప్రజా నేత చేయని వ్యాఖ్యలను చేసినందుకు టీడీపీ ఎంపీలు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. బీజేపీ, టీడీపీ కుమ్మక్కు అయిందన్న మాటకు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో టీడీపీ ఎంపీల తీరే నిదర్శనమన్నారు పవన్ కళ్యాణ్. సీఎం చంద్రబాబుకు ప్రధాని నరేంద్ర మోడీ అంటే భయమని, అందుకు కారణం గతంలో ఉన్న కేసులతోపాటు.. కొత్తగా నోటుకు ఓటు కేసులో కూడా చంద్రబాబు చిక్కుకోవడమేనన్నారు.
