అర్చకులు, ఆలయ ఉద్యోగులకు త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అందనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తును తుది దశకు చేర్చింది. దేవాదాయ శాఖకు సంబంధించి పలు అంశాలపై సోమవారం బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ లో గృహ నిర్మాణ,న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాదాయ శాఖ క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణపై కసరత్తు కొనసాగుతుందని, త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆలయాల వారీగా క్యాడర్ స్ట్రెంత్ నిర్ధారణ అయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అర్చకులు,ఆలయ ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ నాటికి అంటే జూన్ 2, 2014 కంటే ముందు నియమించబడ్డవారికి మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు.
see also:సబ్బండ వర్గాలకు సీఎం కేసీఆర్ సంక్షేమం..ప్రతిపక్ష నేతల్లో గుబులు
ఆగస్టు 1 నుంచి మరిన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే వచ్చిన దరఖాస్తులను మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. దేవాదాయ శాఖ చట్టంలోని నిబంధనలకు లోబడి అర్హమైన ఆలయాలకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 5289 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే పథకాన్ని ప్రారంభించాల్సి ఉండగా ,ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. కొన్ని చోట్ల అనర్హులైన వారిని ధూప దీప పథకంకు సిఫారసు చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని, మరింత పారదర్శకంగా ఉండేందుకు సమగ్ర విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
see also:సిద్దిపేటలో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలివే ..!
ప్రతి ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన అర్చకుల జాబితాను జూలై నెలాఖరు కల్లా సమర్పించాలని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఒకవేళ అనర్హులను ఎంపిక చేస్తే… సంబంధిత అధికారిదే పూర్తి బాధ్యతని, వారిపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విచారణ పూర్తై నిబంధన మేరకు దరఖాస్తు చేసుకున్న ఆలయ అర్చకులకు ఆగస్టు నుంచి ధూప దీప నైవేద్య పథకం అమలు చేస్తామన్నారు. కొన్ని ఆలయాల్లో అర్చకులుగా పని చేస్తున్న విశ్వకర్మలతో పాటు గిరిజన ఆలయ పూజారులకు కూడా ధూప దీప నైవేద్య పథకాన్ని వర్తింపజేయనున్నట్లు వెల్లడించారు.
see also:అన్ని వర్గాల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం..మంత్రి కేటీఆర్
ప్రసిధ్ద పుణ్యక్షేత్రాలైన భద్రాచలం,బాసర, ధర్మపురి ఆలయాల బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్)ను సిధ్దం చేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయా ఆలయాలకున్నభూమి ఎంత ? సౌకర్యాల కల్పన, పనుల ప్రాధన్యతను బట్టి మాస్టర్ ప్లాన్ రూపోందించాలన్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇప్పటికే ఈ ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు కేటాయించారని ఈ సందర్భంగా వెల్లడించారు. కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ తో మాస్టర్ ప్లాన్ ను రూపోందించి,మార్పులు,చేర్పుల తర్వాత రెండు, మూడు నెలల్లో పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.