వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో ప్రజల ఆదరాభిమానాల నడుమ విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, వైఎస్ జగన్ తన పాదయాత్రను ఇప్పటికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసి పదో జిల్లాగా తూర్పు గోదావరిలో ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే, వైఎస్ జగన్ మండే ఎండలను, జోరు వానలను సైతం ఖాతరు చేయక, ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తూ ముమ్మిడివరంలోకి అడుగు పెట్టగానే.. ఆ ప్రాంత ప్రజలు జగన్‌కు బ్రహ్మరతం పట్టారు. వైఎస్ జగన్‌పై పూల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలోనే కొందరు కళాశాల విద్యార్థినులు జగన్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, జగన్‌ల మధ్య పోలికల గురించి చెప్పారు. ప్రస్తుతం ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాట ఇచ్చి.. తరువాత కనపడకుండా తప్పించుకుని తిరిగే రకమన్నారు. వైఎస్ జగన్ అలా కాదని, మాట ఇస్తే తప్పే రకం కాదని స్పష్టం చేశారు. అలాగే, ఇచ్చిన హామీని అమలు చేసే వ్యక్తిత్వం ఒక్క వైఎస్ జగన్‌కే ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డిని.. వైఎస్ జగన్‌లో చూసుకుంటున్నామని, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్‌కే ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారు.