ప్రజలకు సురక్షిత మంచినీరు అందించాలనే లక్ష్యంతో సవాల్ గా తీసుకుని చేపట్టిన మిషన్ భగీరథ పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయని వర్క్ ఏజన్సీల కాంట్రాక్టు రద్దు పరిచడానికి ప్రభుత్వం వెనుకాడదని కేసీఆర్ హెచ్చరించారు. జాప్యాన్ని, నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేని తేల్చి చెప్పారు. గ్రామాలకు నీటి సరఫరా చేసే పనులతో పాటు, గ్రామాల్లో అంతర్గత పనులను కూడా సమాంతరంగా చేయాలని చెప్పారు. కొన్ని చోట్ల ఓహెచ్ఎస్ఆర్ పనులు అనుకున్నంత వేగంగా జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసిన కేసీఆర్, డెడ్ లైన్ పనులు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఓహెచ్ఎస్ఆర్ ల నిర్మాణం కాలేదనే నెపంతో గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం ఆపాల్సిన అవసరం లేదని, వాటి నిర్మాణాన్ని కొనసాగించాలని చెప్పారు. పైపులైన్లు, నల్లాలు, ఇతర సామాగ్రిని నిర్మాణ ప్రాంతాలకు తరలించి స్టోర్ చేసి పెట్టాలని సిఎం చెప్పారు. రేయింబవళ్లు కష్టపడుతూ, శరవేగంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకుని మిషన్ భగీరథలో కూడా వేగం పెంచాలని సూచించారు.
మిషన్ భగీరథపై ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, కార్యదర్శి స్మితా సభర్వాల్, ఎంపి బాల్కసుమన్, టిఎస్ఐఐడిసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఆర్ డబ్ల్యుఎస్ ఇఎన్సి సురేందర్ రెడ్డి, సిఇలు, ఎస్ఇలు, ఇఇలు పాల్గొన్నారు. జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా పనుల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలోని దాదాపు 25వేల ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచినీటిని ప్రతీ రోజు సరఫరా చేసే విధంగా మిషన్ భగీరథ పథకం చేపడుతున్నామని అసెంబ్లీలో మాటిచ్చానని సిఎం గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు వేగంగా జరగాలని చెప్పారు. ఇప్పటికే 12వేలకు పైగా గ్రామాలకు మంచీనీటి సరఫరా జరుగుతున్నది, మిగతా గ్రామాలకు ఆగస్టు చివరినాటికి పూర్తి కావాలని సిఎం చెప్పారు. అంతర్గత పనులను కూడా త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే టీములను పెంచి మూడు షిఫ్టులు పనిచేయాలని చెప్పారు.
‘‘మిషన్ భగీరథ చాలా పెద్ద ప్రాజెక్టు. ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ప్రాజెక్టును బాగా నిర్మిస్తే వర్క్ ఏజన్సీలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇది ఆ కంపెనీలకు దేశంలో మరిన్ని మెగా ప్రాజెక్టులు చేపట్టడానికి అనుభవంగా, అర్హతగా మారుతుంది. అతిపెద్ద ప్రాజెక్టు కాబట్టి మొదట్లో కొన్ని తప్పులు దొర్లడం సహజం. ఆ తప్పులను వెంటవెంటనే సవరించుకుంటూ పోవాలి. మిషన్ భగీరథ తెలంగాణ భవిష్త్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని చేపట్టిన ప్రాజెక్టు. కొద్ది కాలం పాటు కాంట్రాక్టర్లు పనులు నిర్వహించినా, ప్రభుత్వ అధికారులు, ఇంజనీర్లే దీన్ని పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాబట్టి అధికారులు మొదటి నుంచీ దీనిపై శ్రద్ధ పెట్టాలి.పనుల నాణ్యత విషయంలో రాజీపడవద్దు. పకడ్బందీగా పనులు చేయించాలి. విద్యుత్ సరఫరాలో జరిగే హెచ్చు తగ్గులను సమీక్షించేందుకు మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ల వద్ద అవసరమైన సిబ్బందిని నియమించాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
రాష్ట్రంలోని అన్ని నీటి పారుదల ప్రాజెక్టుల రిజర్వాయర్లలో మినిమయ్ డ్రాయింగ్ డౌన్ లెవల్ (ఎండిడిఎల్) నిర్వహించాలని, తాగునీటికి అవసరమయ్యే నీటిని రిజర్వ్ చేసిన తర్వాత సాగునీటికి నీరు విడుదల చేసే విధంగా ఉత్తర్వులు జారీ చేయాలని సిఎం ఆదేశించారు. అగ్రిమెంటులో పేర్కొన్న దానికన్న అదనంగా పడే జిఎస్టీని ప్రభుత్వమే చెల్లిస్తుందని సిఎం హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ పైపులైన్లు ఉన్న ప్రాంతంలో భూ ఉపరితలంలో గ్యాస్ పైపులైన్ల వద్ద పెట్టే విధంగా ఇండికేటర్స్ పెట్టాలని సిఎం సూచించారు.