టీడీపీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేస్తున్న ఉక్కు దీక్షలో చిత్తశుద్ధి ఉందా..? పార్లమెంటు వేదికగా నాలుగేళ్లు నోరుమెదపని ఆయన ఇప్పటికిప్పుడు దీక్షకు కూర్చుకోవడానికి కారణమేంటి..? అసలు ఆయన స్టీల్ ఫ్యాక్టరీ కోసమే దీక్షకు పూనుకున్నారా..? రాజకీయ లబ్ది కోసం దొంగ దీక్ష చేపడుతున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే..!
టీడీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన బఢా పారిశ్రామిక వేత్త సీఎం రమేష్. ప్రజల కోసం నయా పైసా పనిచేయడు అన్న పేరు ఆయనకుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అందరినీ బెదిరిస్తుంటాడని, కానీ, తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం ఆ అధికారాన్ని ఏ మాత్రం ఉపయోగించడని టీడీపీ శ్రేణులే అనడం గమనార్హం.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వార్త మేరకు… సీఎం రమేష్ రూ.5వేల కోట్ల అవినీతి విషయానికొస్తే..!!
2014 సాధారణ ఎన్నికల సమయంలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది.
ఈ క్రమంలోనే చంద్రబాబు సర్కార్ చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు సంబంధించిన కాంట్రాక్టు పనులను రాజ్యసభ సభ్యుడు, ఎంపీ సీఎం రమేష్‌కు కేటాయించడం జరిగింది. హంద్రీనీవాలోని పది ప్యాకేజీల పనులు, అలాగే హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను రమేష్ సంస్థలకే అప్పగించారు సీఎం చంద్రబాబు. అంతేకాక, గాలేరు నగరి ఫేజ్ – 1లో రెండు ప్యాకేజీల విలువ రూ.40కోట్ల అంచనా వ్యయం ఉన్నప్పుడు సీఎం రమేష్‌కు కాంట్రాక్టును అప్పగించగా.. ఇప్పటికీ ఆ పనులు పూర్తి కాలేదు. ఈ పనులకు సంబంధించి ప్రస్తుత అంచనా విలువ రూ.100 కోట్లకు పెరిగిందంటూ సీఎం రమేష్ ప్రభుత్వానికి మళ్లీ బిల్లు పెట్టడం గమనార్హం. సీఎం రమేష్ సంస్థకు కేటాయించిన రూ.120 కోట్ల వంశధార ప్రాజెక్టు పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు. గుత్తి – తాడిపత్రి నేషనల్ హైవే పనులలతోపాటు గండికోట ముంపు గ్రామాల ఆర్ అండ్ ఆర్ పనులను కూడా చంద్రబాబు సర్కార్ సీఎం రమేష్‌కే కేటాయించడం గమనార్హం.
సీఎం రమేష్ కాంట్రాక్టుల దందాలు అంతటితో ఆగలేదు. 60సీ నిబంధన కింద టీడీపీ అధికారంలోకి రాకముందు కాంట్రాక్టులను చేజిక్కించుకున్న వారిని బెదిరించి మరీ కాంట్రాక్టులను తన సంస్థకే వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తడి తెస్తున్నారు. కాంట్రాక్టులు దక్కించుకున్న సీఎం రమేష్ సంస్థలు పనులను పూర్తి చేస్తున్నాయా..? అంటే అదీ లేదు. సీఎం రమేష్ తీరుపై టీడీపీలోనూ తీవ్ర అసంతృప్తి ఉండటంతో ఇప్పటికైనా సీఎం రమేష్ కాంట్రాక్టుల దందాలపై దృష్టి సారించాలని టీడీపీ నేతలే చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు పోవడం గమనార్హం. ఏదేమైనా ఎంపీ సీఎం రమేష్ తీరు ‘పని తక్కువ.. ఆత్రమెక్కువ’ అనే రీతిలో ఉందని టీడీపీ నేతలే అంటున్నారు.
ఇలా ప్రాజెక్టుల పేరుతో 5వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డ బఢా పారిశ్రామిక వేత్త, టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ నేడు కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం దీక్ష చేస్తుండటం హాస్యాస్పదంగా ఉందని ప్రజాస్వామ్య వాదులే మీడియా వేదికగా బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.