తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు.ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో తెలంగాణభవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్బంగా మంత్రి మాట్లాడారు.అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
సీఎం కేసీఆర్ ఏ పని చేసినా చిత్త శుద్ధితో చేస్తారన్నారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా దేశంలో ఇంకా వేలాది గ్రామాలకు కరెంట్ లేదు. తెలంగాణకు కాంగ్రెస్ చేసిన ద్రోహం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆంధ్రాకు, తెలంగాణకు బలవంతపు పెళ్లి చేసింది కాంగ్రెస్సేనని ఆరోపించారు. దేశాన్ని, రాష్ర్టాన్ని కాంగ్రెస్ అధోగతి పాలు చేసింది. 1969 ఉద్యమంలో తెలంగాణ బిడ్డల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని మండిపడ్డారు.విధిలేని పరిస్థితుల్లోనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు.