రైతాంగానికి అన్నగా సీఎం కేసీఆర్ ఉన్నారని, అందుకే రాష్ట్రంలోని మొత్తం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉందన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి. రైతులకు రైతు బంధు కింద పంటల పెట్టుబడులతోపాటు, రైతులకు బీమా చెల్లించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు చేశారు.
see also:వచ్చే నెల 2 నుంచి రెండో విడుత గొర్రెల పంపిణీ..!!
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం కింద రైతులకు పంటల పెట్టుబడులు ఇస్తున్నారన్నారు. ఎకరాకు రూ.4వేల చొప్పున ఏడాదికి రెండు పంటలకు రూ.8వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడాలేదన్నారు. అలాగే రైతు బీమా పథకం కింద రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి, ఏ కారణాలతో చనిపోయినా ఇంటింటికి బీమా డబ్బులు అందించే ప్రభుత్వం కూడా ఎక్కడా లేదన్నారు. ఎరువుల కొరత తీర్చి, నకిలీ విత్తనాల బెడద లేకుండా చేసి, 24 గంటలూ విద్యుత్‌ని అందచేసి, సాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించి, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కెసిఆర్ రైతుల కుటుంబాలకు పెద్దన్నగా పెద్ద దిక్కుగా మారారన్నారు.
see also:రేపు విజయవాడకు సీఎం కేసీఆర్
రైతుల స్వయం సమృద్ధి కోసం రైతు సేవా సమితిలను ఏర్పాటు చేసి సంఘటితం చేశారన్నారు. మార్కెట్ యార్డులు, గోదాములు పెట్టారని చెప్పారు. ప్రతి మండల కేంద్రానికి ఒక గోదాం చొప్పున, ఒక మార్కెట్ యార్డు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి రైతుల హర్షధ్వానాల మధ్య చెప్పారు. ఇందులో భాగంగా రాజాపూర్, బాలానగర్‌లకు నూతన మార్కెట్ యార్డులు, గోదాములు త్వరలోనే వస్తాయని ప్రకటించారు.
see also:ప్రధానితో మంత్రి కేటీఆర్..కీలక అంశాలపై వినతి
అనంతరం మంత్రి లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. ఏటా రూ.45వేల కోట్లతో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నట్లు చెప్పారు.
see also:కాంగ్రెస్ లోకి డిఎస్..!!
టీఆరెస్ లో చేరికలు
బాలానగర్ మండలం గుడిబండ తండాలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రంలో సిఎం కెసిఆర్, జడ్చర్ల నియోజకవర్గంలో మంత్రి లక్ష్మారెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై టిఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. స్థానిక అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి తెలంగాణ రాష్ట్ర సమితిలోకి ఆహ్వానించారు. అలాగే తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని చెప్పారు.
ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.