తమ ప్రేమను బతికంచండంటూ ఓ యువకుడు సూసైడ్ నోట్ రాసి సెల్ టవర్ ఎక్కిన ఘటన నల్గొండ జిల్లాలో కలకలం సృష్టించింది. కొండమల్లేపల్లికి గ్రామానికి చెందిన ఓ యువకుడు మంగళవారం ఉదయం సెల్‌టవర్ ఎక్కాడు. తాను ప్రేమించిన అమ్మాయిని ఆమె తల్లిదండ్రులు బంధించారని, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని లేదంటే దూకుతానని హెచ్చరిస్తున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది యువకుడికి నచ్చజెప్పి కిందికి దింపే ప్రయత్నం చేస్తున్నారు. ఆ యువకుడిపై అమ్మాయి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ అయిన తమ కుమార్తెను ఆ యువకుడు ప్రలోభాలకు గురి చేశాడని వారు మండిపడ్డారు. తమ కూతురికి మైనారిటీ తీరలేదని, అందుకే ఇప్పుడు పెళ్లి చేయలేమని ఆమె తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. తమ కూతురుని బంధించలేదని, మైనారిటీ తీరకుండా వివాహం ఎలా చేస్తామని ప్రశ్నిస్తున్నారు.
సెల్‌టవర్ ఎక్కిన ఆ యువకుడు రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ లేఖలో.. గత నాలుగు సంవత్సరాలుగా తాము ప్రేమించుకుంటున్నామని, ప్రేమ విషయం తెలిసి తనపై ఆమె తల్లిదండ్రులు అక్రమ కేసులు పెట్టించారని ఆ యువకుడు పేర్కొన్నాడు. ఇద్దరివి వేరువేరు కులాలు కావడంతోనే తమ ప్రేమను అడ్డుకుంటున్నారని ఆరోపించాడు. గతంలో తమను కొట్టారని.. అప్పుడు పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టామని నోట్‌లో తెలిపాడు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని, ఇప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆమెను బంధించి చిత్రవదలకు గురిచేస్తున్నారని తన లేఖలో వివరించాడు.