ఎన్నికల విషయంలో కాంగ్రెస్ నేతలది మేకపోతు గాంభీర్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ల చరిత్ర మరిచిపోయి ఆరోపణలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ద్రోహపూరిత చరిత్రను ప్రజలకు తెలియజేయాలన్న మంత్రి… కుటుంబ పాలనపై కాంగ్రెస్ నేతలు మాట్లాడటం విడ్డూరమన్నారు. టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మోహన్ రెడ్డి, రైస్ మిల్లర్స్ అసోషియేషన్ అధ్యక్షుడు గంప నాగేందర్, పలువురు నేతలు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా కప్పిన మంత్రి కేటీఆర్.. వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
see also:ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ‘సాక్షి’ చీఫ్ ఘన విజయం
ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్.. రైసు మిల్లర్ల సమస్యపై వారం రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి రైస్ మిల్లర్ల సంయుక్త సమావేశం నిర్వహిస్తమని మంత్రి తెలిపారు. రైస్ మిల్లర్లకు శాశ్వత ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం కేసీఆర్ పాలన బ్రహ్మాండంగా కొనసాగుతున్నదని మంత్రి తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. “తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకారమైతదని అసత్య ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కరెంట్ కొరత తీర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత టీఆర్‌ఎస్ సర్కార్‌ది. తెలంగాణ నాయకత్వ పటిమ వల్ల రోజుకు 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి చేరుకున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టిన ఘనత సీఎం కేసీఆర్‌ది. దేశానికి ధాన్య బాండాగారంగా తెలంగాణ తయారయింది. రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు..” అని కేటీఆర్ తెలిపారు.
see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం కేసీఆర్ ఆదేశం
నెహ్రూ నుంచి ఉత్తమ్ వరకు కాంగ్రెస్ వారిది కుటుంబ పాలనేనని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. అవినీతిపై మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని మంత్రి మండిపడ్డారు. కాంగ్రెస్ విధిలేక, అనివార్యంగా తెలంగాణ ఇచ్చిందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజలు మద్దతిస్తే మరోసారి సేవ అందిస్తామన్న మంత్రి.. ప్రజలు వద్దనుకుంటే దానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు.