వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. అయితే, వైఎస్ జగన్ ఇప్పటికే ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేసుకుని పదో జిల్లాగా తూర్పు గోదావరిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. జగన్ మాత్రం వారి సమస్యలను వింటూ.. అర్జీలను స్వీకరిస్తూ.. వారిలో భరోసాను నింపుతూ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు.
అయితే, జగన్ పాదయాత్ర నేపథ్యంలో ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసిన పలు పార్టీల సీనియర్ నేతలు వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలోనే ఉత్తరాంధ్రలో కాంగ్రెస్‌కు కీలక నేతగా ఉన్న ద్రోణం రాజు శ్రీనివాస్ కూడా వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ నేతలతో చర్చలు కూడా జరిపారని, వైఎస్ జగన్ తన పాదయాత్ర ద్వారా విశాఖ జిల్లాకు చేరుకోగానే ద్రోణం రాజు శ్రీనివాస్ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా, 2004 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ -1 నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి రెహ్మాన్‌పై, అలాగే, 2009 ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి కోలా గురువుపై ద్రోణంరాజు శ్రీనివాస్ విజయం సాధించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఏపీలో అంతగా పరిస్థితి కలిసిరాని నేపథ్యంలో.. ద్రోణంరాజు శ్రీనివాస్ డోలాయమానంలో పడింది. ఈ నేపథ్యంలో తన కేడర్‌ను, తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ ఫాలోవర్స్‌ను కాపాడుకునే క్రమంలో అతి త్వరలో కాంగ్రెస్‌ను వీడి వైసీపీలో చేరనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
see also:టీడీపీ అధికారంలోకి వచ్చాక ..అనేక మంది వైసీపీ కార్యకర్తలపై దాడులు