అందరిని భాగస్వామ్యం చేసి ముందుకు వెళ్తేనే హరిత తెలంగాణ సాధ్యమవుతుందని, ఆ దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, అటవీశాఖ మంత్రి జోగు రామన్న కోరారు. గ్రామ గ్రామాన నర్సరీల ఏర్పాటుపై దూలపల్లిలోనే తెలంగాణ అటవీ అకాడమీలో గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయ, ఉధ్యానవన అధికారుల రెండు రోజుల శిక్షణ తరగతులను సోమవారం మంత్రులు ప్రారంభించారు. మొదటివిడతగా 15 జిల్లాల అధికారులకు శిక్షణ కార్యక్రమాలను అటవీశాఖ సహకారంతో గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది.
see also:తెలంగాణ వచ్చాకే నర్సింగ్ సమాజానికి గుర్తింపు ..!
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ… చైనా, బ్రెజిల్ తరువాత పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్నామని, బంగారు తెలంగాణ సాధనలో హరితహారం కూడా కీలకమన్నారు. ఎన్నో ఏళ్లపాటు పోరాడి సాధించుకున్న తెలంగాణ దేశంలోనే అనేక అంశాల్లో అగ్రగామిగా నిలిచిందని, హరితహారం కార్యక్రమంలోను ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలు, ప్రజాప్రతినిధులను పూర్తి స్థాయిలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఆ దిశగా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పూలు, పండ్ల మొక్కల ద్వారా ఆదాయం కూడా సమకూర్చుకునే అవకాశం ఉందని, గ్రామీణులకు అవసరమైన మొక్కలను నర్సరీల్లో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
హరితహారానికి నిధుల కొరత లేదని, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అలాగే 85 శాతానికి పైగా మొక్కలు మనుగడ సాగించేలా పంచాయతీల పాలకవర్గాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం ఏ ఒక్కరికోసమో కాదనీ, అందరి కోసం అని భావించేలా ప్రజల్లో చైతన్యం తెచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
మరో మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక హరితహారం అని, మూడేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలను పెట్టాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నామనీ, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. హరితహారంలో అటవీశాఖతో పాటు మానవ వనరులు అత్యధికంగా ఉన్న గ్రామీణాభివృద్ధి శాఖ కీలక పాత్ర అనీ గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయిలో శిక్షణ పొందిన అధికారులు జిల్లా, మండల స్థాయిల్లో శిక్షణ ఇవ్వనున్నారు.
see also:సీఎం సవాలును స్వీకరించిన ఉత్తమ్..!!