సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గరపడుతున్న క్రమంలో ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తాము గెలిపించి, అధికారం ఇచ్చిన నాయకులకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటు వేయని పౌరుడు సైతం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాడంటే ఏపీలో పాలన ఎంత దయనీయ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
మరో పక్క సీఎం చంద్రబాబు పాలనను దృష్టిలో ఉంచుకుని సర్వే నిర్వహించిన సంస్థలన్నీ టీడీపీకి వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారంటూ ఎన్నికల సర్వే సంస్థలన్నీ ఫలితాలను వెల్లడించాయి. ఈ సర్వేలను దృష్టిలో పెట్టుకున్న అధికార పార్టీ టీడీపీతో సహా.. పలు పార్టీల సీనియర్, యువ నాయకులు ఇటీవల కాలంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే, ఇతర పార్టీ నాయకులందరూ వైసీపీలో చేరేందుకు మొగ్గు చూపేందుకు కారణం.. ప్రజల్లో జగన్‌కు పెరుగుతున్న ఆదరణను చూసేనని స్పష్టం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పార్టీల నేతలతోపాటు.. వర్గాల నాయకులు వైసీపీలో చేరుతున్నారు.
ప్రస్తుతం అమలాపురంలో పాదయాత్రలో ఉన్న జగన్‌ను కలిసి కాపు నేత అయిన ఒంటెద్దు వెంకయ్య నాయుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక్క వెంకయ్య నాయుడు మాత్రమే కాకుండా, అతనికి సంబంధించిన 800 మంది అనుచరులు కూడా వైసీపీలో చేరారు. తమ బాధలను, గడిచిన నాలుగేళ్ల టీడీపీ పాలనపై జగన్‌కు తమ చెప్పుకున్నారు.
అయితే, కాపులు ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో జగన్‌కు వస్తున్న మద్దతు చూస్తుంటే ఈ సారి కాపుల ఓట్లన్నీ జగన్‌కే పడతాయని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, మరో పక్క వైఎస్ జగన్ తమ సామాజిక వర్గానికి జగన్ హామీ ఇవ్వడంతో వైసీపీలో చేరినట్టు వారు స్పష్టం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల తరువాత జగన్ కచ్చితంగా సీఎం అవుతారని 800 మంది కాపు నాయకులు స్పష్టం చేశారు.