కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్ తన అనుచరులతో కలిసి ఇవాళ ప్రస్తుత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని తెలంగాణ భవన్ లో దానం నాగేందర్ ఆయన అనుచరులకు సీఎం కేసీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర అని ..ఇప్పుడు రాష్ట్ర పునర్‌నిర్మాణం మరో చరిత్ర అని చెప్పారు . ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టామని, బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు . పట్టుదలతో పనిచేస్తే ఏదైనా సాధ్యమేనన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు.
రైతులకు 24 గంటల విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం తెలిపారు.వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 100 స్థానాల్లో గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని అన్నారు.ఇసుక మాఫియా అంటూ విపక్షాలు అర్ధంలేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. ఇసుకపై రూ. 1675 కోట్ల ఆదాయం వచ్చిందని తెలిపారు.
కాళేశ్వరం, సీతారామా, పాలమూరు ప్రాజెక్ట్‌లు పూర్తయితే… తెలంగాణలో రూ. లక్ష కోట్ల పంట పండుతుందన్నారు.ఆర్తి, ఆర్థత నుంచి పుట్టుకొచ్చిందే కళ్యాణలక్ష్మి పథకమని అన్నారు. తెలంగాణ 85 శాతం బలహీన వర్గాలున్న రాష్ట్రం. కళ్యాణలక్ష్మిని అగ్రకులాల్లోని పేదలకు కూడా ఇస్తున్నమని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.