వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం తప్పదన్న నేపథ్యంలో చాలా మంది నేతలు అటువైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలే ఇప్పుడు కొంతమంది వైసీపీ బాట పట్టడానికి రెడీ అవుతుంటే, మాజీలు కొందరు ఇప్పటికే జెండా ఎత్తేశారు. వీరు తెలుగుదేశం పార్టీని వీడేశారు. వైసీపీలో అవకాశం కోసం చూస్తున్నారు. వారిలో అన్నా రాంబాబు కూడా ఒకరు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ఈయన. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు కూడా. అయితే వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు.
అయితే వైసీపీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించాడు. ఫిరాయించిన నేతలకు పెద్దపీట వస్తున్న చంద్రబాబు నాయుడు అన్నా రాంబాబును పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఈయన తెలుగుదేశం పార్టీ జెండాను నేలకేసి కొట్టి బయటకు వచ్చాడు. వైసీపీలోకి చేరే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సందర్భంగా అన్నా రాంబాబుకు కొన్ని షరతులు ఎదురైనట్టుగా తెలుస్తోంది.
అందులో ముఖ్యమైనది టికెట్ పై ఆశలు పెట్టుకోవద్దు అనేది. టికెట్ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేమని, పార్టీలోకి చేరదల్చి పని చేయగలిగితే చేయవచ్చని వైసీపీ నేతలు స్పష్టం చేసినట్టుగా సమాచారం. పార్టీ కోసం నిబద్ధతతో పని చేస్తే.. అందుకు ప్రయోజనాలు అయితే కచ్చితంగా ఉంటాయని, పార్టీ అధికారంలోకి తీసుకురావడానికి పని చేస్తే.. జగన్ కచ్చితంగా బాగా చూసుకుంటాడని వీరు హామీ ఇచ్చినట్టుగా సమాచారం. షరతులు పెట్టి వైసీపీలోకి చేరడం కుదరదు అని వీరు స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ షరతులకు ఒప్పుకుంటేనే చేరవచ్చని తెలిపినట్టుగా సమాచారం.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్నా రాంబాబు తీరు బాగా విమర్శల పాలైంది. ప్రత్యేకించి రెడ్డి సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఈయన వ్యవహరించాడు. దీంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచి, గత ఎన్నికల ముందు తెలుగుదేశంలో చేరాడు. ఇతడి ట్రాక్ రికార్డును బట్టి వైసీపీ నేతలు కూడా ఆచితూచి స్పందిస్తున్నట్టుగా సమాచారం