విజయవాడ..రాజధానిలోని పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్‌లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్‌లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్‌లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్‌గా చల్లా రామకృష్ణారెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, కాలువ శ్రీనివాసులు హాజరయ్యారు. వీరితోపాటు పలువురు టీడీపీ నేతలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్, మీనాక్షి నాయుడు, మరికొందరు నేతలు లిఫ్ట్ ఎక్కారు. వారు లిఫ్ట్ ఎక్కిన తర్వాత సాంకేతిక లోపంతో అది మధ్యలోనే ఆగిపోయింది. దీంతో 15 నిమిషాలపాటు నేతలు లిఫ్ట్‌లోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. శ్వాస అందక ఒక దశలో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ క్రమంలో లిఫ్ట్‌లోని నేతలు ఫోన్ ద్వారా బయట ఉన్నవారికి సమాచారం అందించడంతో.. సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగింది. లిఫ్ట్ డోర్‌ను తొలగించి.. వారిని బయటకు తీసుకురావడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.