ఘన వ్యర్థాల నిర్వహణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2018 ప్రత్యేక పురస్కారాన్ని ఇవాళ ఇండోర్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో కేంద్ర పట్టణాభివృద్ది, గృహనిర్మాణ శాఖ మంత్రి హర్దీప్సింగ్పూరి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌లు కూడా ఈ అవార్డును అందుకున్నవారిలో ఉన్నారు. దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలు రాజధానులు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు అవుతున్న ఘనవ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్ అగ్రస్థానాన్ని ప్రకటించింది. స్వచ్ఛ భారత్ 2018 అవార్డుల ప్రధానం నేడు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో నేడు ప్రధానం చేశారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి మేయర్ బొంతు రామ్మోహన్, ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్ రవికిరణ్‌లు హాజరై అవార్డును స్వీకరించారు.
ఘన వ్యర్థాల నిర్వహణలో జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు
హైదరాబాద్ నగరంలో 1,116 ఓపెన్ గార్బెజ్ పాయింట్లను ఎత్తివేయడం, స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఇంటింటి నుండి తడి పొడి చెత్తలను వేర్వేరుగా చేయడానికి ఇంటింటికి రెండు డస్ట్బిన్ల చొప్పున 44లక్షల డస్ట్బిన్ల పంపిణీ, గృహిణులకు బొట్టు, తిలకం పెట్టడం, స్వయం సహాయక మహిళలు, పాఠశాల విద్యార్థినీవిద్యార్థులచే ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించడం, భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు, ప్రతి సర్కిల్లో గార్బెజ్ సెగ్రిగేషన్ పాయింట్లను ఏర్పాటు చేయడం తదితర వినూత్న కార్యక్రమాల అమలు చేయడం ద్వారా ఘన వ్యర్థపదార్థాల నిర్వహణలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకుగాను ఈ క్రింది కార్యక్రమాలను జీహెచ్ఎంసీ గత కొద్ది కాలంగా అమలు చేస్తోంది. మరే మున్సిపల్ కార్పొరేషన్లో లేనివిధంగా హైదరాబాద్ నగరంలో ఇంటింటికి రెండు డస్ట్బిన్ల చొప్పున 44లక్షల డస్ట్బిన్ల ను జీహెచ్ఎంసి అందజేసింది. ఈ డస్ట్‌బిన్ ద్వారా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేయడానికి పెద్ద ఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. అయితే, తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేయడం కేవలం పాశ్చత్య దేశాలలోని నగరాల్లోనే జరుగుతోంది. భారత దేశంలోని ఏ నగరంలోనూ చెత్తను వేర్వేరుగా సేకరించే విధానం అమలు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఘన వ్యర్థాల నిర్వహణ చట్టం -2016ను పటిష్టంగా అమలుచేస్తోంది. దీనిలో భాగంగా తడి, పొడి చెత్తను వేర్వేరు చేయడం, పరిసరాల పరిశుభ్రత, గార్బెజ్ పాయింట్లను తొలగించడం, పారిశుధ్య కార్యక్రమాలు, ఘన వ్యర్థాల తొలగింపులో కాలనీ సంక్షేమ సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులతో పాటు దాదాపు 5లక్షల మంది సభ్యులున్న స్వయం సహాయక బృందాల మహిళలు, 10లక్షలకుపైగా ఉన్న పాఠశాల విద్యార్థినీవిద్యార్థుల సహకారాలను చేపట్టింది. దీనిలో భాగంగా నగరంలోని వివిధ కాలనీల్లో ఇంటింటికి వెళ్లి గృహిణీలు, ఇళ్లలో పనిచేసేవాళ్లకు తడి,పొడి చెత్తను ఆకుపచ్చ, నీలంరంగు డబ్బాల్లో వేసేవిధంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చైతన్య కార్యక్రమాలను నిర్వహించారు.
ఇదే విషయాన్ని గృహిణులకు బొట్టు, తిలకం పెట్టి స్వయం సహాయక మహిళలు, జీహెచ్ఎంసి పారిశుధ్య సిబ్బంది ప్రత్యేకంగా గృహిణీలకు కూడా విజ్ఞప్తి చేశారు. ఎవరైతే తమ చెత్తను స్వచ్ఛ ఆటో ట్రాలీలకు అందించడంలేదో అట్టి ఇళ్ల వివరాలు స్వచ్ఛ సి.ఆర్.పి.లు సేకరించి, వీరిని తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకే తడి, పొడి చెత్తలుగా వేరు చేసి అందించాలని అవగాహన కల్పించారు. దీనితో పాటు బహిరంగంగా చెత్తను కాల్చవద్దని కూడా కాలనీవాసులతో పాటు ప్రతి ఒక్కరినీ చైతన్య పర్చడం జరిగింది. ముఖ్యంగా బొట్టు (తిలకం) పెట్టి చెత్తను వేర్వేరుచేయాలని కోరడం పట్ల మహిళలు ప్రత్యేకంగా స్పందించారు. తప్పనిసరిగా తాము తడి, పొడి చెత్తలను వేర్వేరుగా చేయగలమని జీహెచ్ఎంసి సిబ్బందికి హామీ ఇచ్చారు. దీంతో పాటు ప్రతి కాలనీలు, పార్కులు, హోటళ్లు, రెస్టారెంట్లలో కంపోస్టింగ్ ఎరువుల తయారీకి ప్రత్యేకంగా గుంతలు తవ్వించుకోవాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అవగాహన కల్పించారు. ఇప్పటికే నగరంలోని నిరుద్యోగ యువతకు అందించిన 2వేల స్వచ్ఛ ఆటో టిప్పర్ల ద్వారా తడి, పొడి చెత్తలను వేర్వేరుగా తరలించే ప్రక్రియతో పాటు మరో 500 స్వచ్ఛ ఆటోలను కూడా నిరుద్యోగ యువతకు జీహెచ్ఎంసీ అందించింది.