తెలంగాణలో ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు తెలిపారు. అంతే కాకుండా తెలంగాణలో నాణ్యమైన విద్యను ఉచితంగా అందించేందుకు దేశంలో ఎక్కడా లేనన్ని 573 గురుకులాలను ఈ నాలుగేళ్లలో ఏర్పాటు చేశామని, తద్వారా తెలంగాణలో ఇప్పుడు మొత్తంగా 813 గురుకులాలు ఉన్నాయన్నారు. ఏటా వీటికోసం 3400 కోట్లరూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థికి 1,25,000 రూపాయలను వెచ్చిస్తున్నామన్నారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ముంబైలో మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేతో సమావేశమై విద్యారంగంలో ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాలపై చర్చించారు.
క్యాబినెట్ అడ్వయిజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్(కేబ్) సబ్ కమిటీ చైర్మన్ గా తాను కేంద్రానికి ఇచ్చిన నివేదికలో బాల్య వివాహాలను అరికట్టి, బాలికా విద్యను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా కేజీబీవీలను 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు పొడగించాలని ఇచ్చిన ప్రతిపాదనలను ఆమోదించడంతో కేజీబీవీలు ఇక దేశవ్యాప్తంగా 12వ తరగతి వరకు విద్యనందించనున్నాయన్నారు. తెలంగాణలో ఈ ఏడాది నుంచే ఇంటర్ ప్రారంభిస్తున్నామని చెప్పారు. కేంద్రం కేజీబీవీల్లో 8వ తరగతి వరకే విద్యనందిస్తుండగా తెలంగాణలో మాత్రం కేజీబీవీల్లో 10వ తరగతి వరకు రాష్ట్ర నిధులతో విద్యనందిస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా కేజీబీవీల్లో దేశంలో ఎక్కడా లేనివిధంగా నాణ్యమైన విద్యతో పాటు అత్యంత పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్లు వివరించారు. నెలకు ఆరుసార్లు మాంసాహారం, వారానికి 5రోజులు గుడ్లు, ప్రతిరోజు భోజనంలో 50 గ్రాముల నెయ్యి, ఉదయం రాగిమాల్ట్, రాత్రి గ్లాసు పాలు ఇస్తున్నామన్నారు. ఆడపిల్లల్లో రక్తహీనతను అధిగమించేందుకు బెల్లంతో తయారు చేసిన పల్లీ పట్టీలు, నువ్వుల పట్టీలు కూడా ఇవ్వాలని ఇటీవలే నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇదే రకమైన పౌష్టికాహారాన్ని సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనారిటీ సంక్షేమ, విద్యాశాఖ గురుకులాలు, మోడల్ స్కూళ్లలో కూడా అందిస్తున్నట్లు వివరించారు.
గురుకుల విధానంలో పనిచేస్తున్న 1505 విద్యా సంస్థల్లో ఒకేరకమైన భోజనాన్ని, ఏకరూప దుస్తులను, వసతులు, విద్యను, అకాడమిక్ క్యాలెండర్ ను అమలు చేస్తున్నామని చెప్పారు. గురుకుల విద్యాలయాల్లో బయో మెట్రిక్ విధానాన్ని, సీసీ కెమెరాలను పెట్టామని, కంప్యూటర్ విద్యను ప్రోత్సహించడంలో భాగంగా కంప్యూటర్ ల్యాబ్ లు, డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నామని చెప్పారు. వీటితో పాటు ఈ ఏడాది నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో ఎక్కువ సీట్లు సాధించే విధంగా విద్యా సంవత్సరం మొదటి నుంచే ప్రత్యేకంగా కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు.
గురుకులాల్లో కూడా డే స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నామని, ఈ భోజనంలో విద్యార్థులకు గుడ్డు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మొత్తం 28,674 పాఠశాలల్లో 25,48,232 మందికి 677 కోట్ల రూపాయలతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు.
విద్యారంగంలోనే కాకుండా తెలంగాణలో పేదింటి మహిళల పెళ్లికి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ అనే పథకాల ద్వారా 1,00,116 రూపాయలను అమ్మాయి తల్లిదండ్రులకు పెళ్లి ఖర్చుల కోసం అందిస్తున్నామన్నారు.
తెలంగాణ రాష్ట్రం విద్యలో అవలంభిస్తున్న విన్నూత్న విధానాలు, బాలికా విద్యకోసం తీసుకుంటున్న చర్యలను మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొనియాడారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి అక్కడి విద్యావిధానాన్ని అధ్యయనం చేస్తామన్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేను సాధరంగా తెలంగాణకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు.
ఇదే సందర్భంగా మహారాష్ట్ర విద్యారంగంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇక్కడ మహారాష్ట్ర ఇంటర్నేషనల్ బోర్డు ను ఏర్పాటు చేశామని, దీనిద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోద విద్యాశాఖలో తాము గత మూడున్నరేళ్లలో చాలా ప్రగతి సాధించామని వివరించారు.
దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల సమావేశంలో రెండు రాష్ట్రాల్లో విద్యావ్యవస్థను పటిష్టం చేయడంపై పరస్పరం సహకరించుకోవాలనే అంగీకారానికి వచ్చారు.