దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని మంత్రి జగదీశ్‌రెడ్డి వెల్లడించారు.జూబ్లీహిల్స్ అపోలో మెడికల్ కాలేజీలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, అపోలో ఆస్పత్రి సంయుక్తంగా ఇచ్చిన వృత్తి నైపుణ్య కోర్సులను పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అయన మాట్లాడుతూ..
తెలంగాణలోని ఎస్సీ యువతలో దాగిఉన్న నైపుణ్యతను వెలికి తీయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఉందన్నారు. ఆర్ధికభారం ఎంతయినప్పటికి ఆధునిక పరిజ్ఞానంలో వృత్తి నైపుణ్యం కోర్సులలో శిక్షణ ఇచ్చే విధంగా ప్రత్యేకంగా నిధులు కేటాయించడమే అందుకు అద్దం పడుతోందన్నారు. ఎస్సీల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో బాగంగానే ఎస్సీల కోసమే ప్రత్యేక అభివృద్ధి చట్టాన్ని అమలులోకి తెచ్చుకున్న విషయాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ఈ తరహ వృత్తివిద్యా నైపుణ్య కోర్సులతో ఎస్సీ యువతకు జీవనోపాధి కల్పిస్తున్న రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ సేవలు అభినందనీయమని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో కొత్త ట్రెండ్స్ సృష్టిస్తుందన్నారు. ఎన్నో రాష్ర్టాలు మన పథకాలు, పాలనపై చర్చిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.