టీడీపీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.ఇవాళ మంత్రి హరీశ్‌రావు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొత్లాపూర్ మండలం కలికోట గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మంత్రి పాల్గొని మాట్లాడారు.కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకోవడానికి చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ‘ఏపీ ఎన్నికల్లో ఓట్ల కోసం చంద్రబాబు.. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి యత్నిస్తున్నారు. ఆయన అలా చేస్తుంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకోరు..’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ కేసులతో మరోవైపు చంద్రబాబు నాయుడు ఢిల్లీకి ఫిర్యాదులతో అడ్డుపడుతున్నారని ఆరోపించారు . పోలవరంపై ఒడిశా రాష్ట్రం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చంద్రబాబు నీవు పోలవరం కట్టడం ఆపుతవా అని మంత్రి ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా త్వరలోనే కోనసీమను తలపిస్తదన్నారు. వచ్చే దసర పండుగ నాటికి సూరమ్మ చెరువులో నీటిని నింపుతామన్నారు. ఇందుకు అవసరమైన 300 ఎకరాల భూమి ఇవ్వాలని రైతులను మంత్రి కోరారు.. కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చిందని.. ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నాయకత్వంలో కట్టి తీరుతాం. ప్రాజెక్టును అడ్డుకోవడం ఎవరి తరం కాదని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.