రామరాజ్య స్థాపనే లక్ష్యంగాముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో పాలన చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల నియోజకవర్గం కోడ్గల్ గ్రామ పంచాయతీ పరిధిలోని పల్గు తండాలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి ఆ తండా వాసులనుద్దేశించి ప్రసంగించారు.
రాష్ట్రంలో గత 60 ఏండ్లల్లో జరగని అభివృద్ధి కేవలం ఈ నాలుగేళ్ళల్లోనే జరిగిందన్నారు. అన్ని రంగాల్లో అభివృద్ధి, సంక్షేమాలతో తెలంగాణ రాష్ట్ర దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచిందన్నారు. తెలంగాణను సాధించడమే కాదు, సాధించిన తెలంగాణ తెర్లు కాకుండా ఉండడానికి సీఎం కెసిఆర్ అనేక పథకాలు ప్రారంభించారన్నారు. ఆయా పథకాలు సాధిస్తున్న ప్రగతిని చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ, పథకాల వైపు చూస్తున్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు సరైన న్యాయం జరుగుతున్నదన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరందించే సమగ్ర సాగునీటి ప్రాజెక్టులు, రైతులకు రుణమాఫీ, పంటల పెట్టుబడులు, రైతు బీమా పథకం, రికార్డుల ప్రక్షాళన ఆలోచన కూడా అంతకుముందు రాష్ట్రాన్ని ఏలిన వాళ్ళకు తట్టలేదన్నారు. ఇంటింటికీ మంచినీరందించే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ద్వారాచెరువుల మరమ్మతులు, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్, తండాలను పంచాయతీలుగా మార్చడం, మా తండాల్లో మా పాలన అంటున్న లంబాడీలకు ఇంతకుముందెప్పుడైనా స్వపరిపాలన ఆలోచన ఎవరు చేసిండ్రు అంటూ ప్రశ్నించారు. అలాంటి వాళ్ళను గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.
కాగా, పల్గుతండాకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలు లక్ష్మణ్. చందర్, రాజు, హర్యా, తిరుపతి, సాయి, రమేష్ గౌడ్, యాదగిరి, నరేందర్, అంజి, హైమతు, భీమయ్య, బుపని చెన్నయ్య, రాములు, శేఖర్, రాముచంద్రి, నరేష్, యాదయ్య, మహేష్, మసృ, లక్ష్మి, సోని, చాప్లి, అంజమ్మ, చాందీ, సునీత, మన్ని తదితరులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి మంత్రి లక్ష్మారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.