ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో అన్నదాతల సంక్షేమం కోసం కృషిచేస్తున్న తెలంగాణ పౌరసరఫరాల సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా బిజినెస్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ పాలక మండలి నిర్ణయించింది. రైతన్నలకు కనీస మద్దతు ధర అందించడంలో భాగంగా బిజినెస్ వింగ్ ఏర్పాటుకు, బిజినెస్ మోడల్‌ను రూపొందించడానికి ఒక కన్సల్టెన్సీని నియమించాలని నిర్ణయం తీసుకుంది.
see also:పసుపు రైతుల సంక్షేమం కోసం ఎంపీ కవిత వినూత్న కార్యాచరణ
సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టుల వల్ల రాబోయే రోజుల్లో అదనంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రాబోతుంది. ఈ ఏడాది ఖరీఫ్, యాసంగిలో మొత్తం 54 లక్షల మెట్రిక్ ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొనుగోలు చేసింది. సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే యాసంగిలో ఇది రెట్టింపు కానుంది. అంటే, కోటి మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రైతులకు కనీస మద్దతు ధర అందించడానికి ముందస్తు ప్రణాళికలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇందులో భాగంగా బిజినెస్ విభాగాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నాడు జరిగిన సంస్థ పాలక మండలి సమావేశంలో నిర్ణయించడం జరిగింది.
see also;దశాబ్దాల భూ వివాదాలకు పరిష్కారం….మంత్రి కేటీఆర్ కీలక నిర్ణయం
పౌరసరఫరాల సంస్థలో వ్యయాన్ని తగ్గించడానికి ఆర్థిక వనరులను క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం పేరొందిన సంస్థల నుంచి ఇంటర్న్‌షిప్ మీద నిపుణులతో అధ్యయనం చేయించి నివేదికను తయారు చేయడానికి నిర్ణయం తీసుకుంది. పౌరసరఫరాల సంస్థలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించాలని, ప్లాస్టిక్ రహిత కార్పొరేషన్‌గా తీర్చిదిద్దాలని సమావేశంలో నిర్ణయించారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా, కనీస మద్దతు ధర లభించడానికి తమిళనాడు రాష్ట్రానికి బియ్యం సరఫరా చేయడానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.