కోటవురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో పదమూడేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనకు దారితీసిన నేపథ్యం పోలీసులనూ దిగ్భ్రాంతికి గురిచేసింది. దారుణానికి కారణం పదిహేనేళ్ల బాలుడని తెలిసి విస్తుపోయారు. నర్సీపట్నం గ్రామీణ సి.ఐ. రేవతమ్మ.. కోటవురట్ల ఎస్సై మధుసూదనరావుతో కలిసి శనివారం విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. సి.ఐ. కథనం ప్రకారం.. నిందితుడైన బాలుడు ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో చేరాలి. తల్లిదండ్రులు ఇతనికో స్మార్ట్ఫోన్ కొనిచ్చారు. దాంట్లో నీలి చిత్రాలను చూడ్డానికి అలవాటు పడ్డాడు. ఈనెల పదో తేదీ సాయంత్రం కోటవురట్ల మండలం బీకేపల్లి సమీపంలోని పొలం పాక వద్ద ఐదుగురు పిల్లలు చేరారు. అందులో ఈ బాలుడితో పాటు ఏడో తరగతి ఉత్తీర్ణురాలైన పదమూడేళ్ల బాలిక కూడా ఉంది. బాలిక నిందితుడికి వరసకు సోదరి అవుతుంది. సాయంత్రం వర్షం పడే సూచనలు ఉండడంతో మిగతా ముగ్గురు పిల్లలు ఇళ్లకు వెళ్లిపోయారు. పొలం పాకలో తమ సిమెంట్ బస్తాలు ఉండడంతో వాటిపై పరదా కప్పేందుకు ఈ బాలిక పాకలోకి వెళ్లింది. బాలుడు ఆమె వెనకే వెళ్లి పట్టుకోబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. బెంబేలెత్తిన బాలుడు ఆమె మెడకు చున్నీ బిగించి తాటాకు పాక రాటకు అదిమిపెట్టాడు. ఊపిరి ఆడక స్పృహ కోల్పోయింది. నేరుగా బాలిక ఇంటికి వెళ్లిన అతడు, బాలికపై సిమెంట్ బస్తా పడిపోయిందని చెప్పాడు. వారొచ్చి వెంటనే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చూపించి, అనంతరం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రి నుంచి పోలీసులకు వర్తమానం వచ్చింది. పోలీసులు వెళ్లి తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు రోజుల తర్వాత బాలిక తల్లిదండ్రులు మళ్లీ పోలీసుల వద్దకు వచ్చి, తమకు ఫలానా బాలుడిపై అనుమానం ఉందని తెలిపారు. దీంతో కేసు దర్యాప్తు సులువైంది. శనివారం ఈ బాలుడు వి.ఆర్.ఒ. వద్ద లొంగిపోయి నేరం అంగీకరించాడు. పిల్లలకు స్మార్ట్ఫోన్లు కొనిచ్చి తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. వారేమి చేస్తున్నారో, ఏం చూస్తున్నారో పట్టించుకోవడం లేదు. ఈ బాలుడు నీలి చిత్రాలకు అలవాటు పడ్డం వల్లనే ఈ దారుణానికి ప్రేరేపితుడయ్యాడు. బాలుడిని జువైనల్ హోంకి తరలించాం.బాలలు కావడంతో వారి వివరాలు గోప్యంగా ఉంచాం.
