అజీర్ణ సమస్యకు పరిష్కారం చూపే వ్యాయామం భుజంగాసనం. భుజంగం అంటే పాము అని అర్థం. ఈ ఆసనం వేసిన తరువాత మన ఆకారం పాము పడగ ఎత్తినట్టుగా ఉంటుంది. అందుకే ఈ ఆసనానికి భుజంగం అనే పేరు వచ్చింది.
ఈ ఆసనం వేసే విధానం ఎలాగో తెలుసుకుందాం…
నేలమీద బోర్లా పడుకుని, తరువాత అరచేతులను నేలమీద ఆనించి శ్వాస తీసుకుంటూ చేతుల ఆధారంగా శరీరాన్ని పైకి లేపాలి. తలను వీలైనంత వరకు ఎంత ఎక్కువగా వెనక్కు వాల్చితే అంత మంచిది. ఈ ఆసనంలో ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు ఉండొచ్చు. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండాలి. ఇలా ఉండగలిగినంత సేపూ ఉండగలిగి తిరిగి యథా స్థితికి రావాలి.
భుజంగాసనం వల్ల ఉపయోగాలు :-
భుజంగాసనం వేయడం వల్ల అజీర్తి వ్యాధి హరించి బాగా ఆకలి కలుగుతుంది. నడుము నొప్పి, ఇతర శరీర నొప్పులు తగ్గిపోతాయి. ఉదర సంబంధమైన అనేక వ్యాధులు నివారించబడతాయి. మూత్రపిండాలు చురుకుగా పనిచేస్తాయి. పొట్ట తగ్గి ఛాతి విశాలమవుతుంది. చేతులు శక్తివంతమవుతాయి.