యోగా అంటే ఆసనాలు వేయడం, శరీరాన్ని మెలికలు తిప్పే భంగిమలు వేయడం అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, అసలు యోగా అంటే సమన్వయంతో సమ స్థితిలో ఉండటమని అసలు అర్థం. సంతోషంగా ఉన్న సమయంలో మన ప్రాణశక్తి బాగా పనిచేస్తుంది. మనం ఏమీ తినకపోయినా, సరిగ్గా నిద్రపోకపోయినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే పనిచేస్తూ ఉంటాం. కొద్దిపాటి సంతోషమే ఈ రకమైన శక్తిసామర్ధాన్ని పెంచుతుంది. అలాగే, యోగాతో అంతర్గత శక్తులను ఉత్తేజ పరచగలిగితే గనుక మన శరీరంతోపాటు మెదడు కూడా అత్యుత్తమంగా పనిచేస్తాయట.
మన లోని అంతర్గత శక్తిని కూడా ఉత్తేజపరచగలిగితే ఒక విభిన్న పద్ధతిలో పనిచేయగలుగుతామని వ్యాయామ నిపుణులు చెబుతున్నారు. మనుషులంతా ఒకే శక్తితో తయారైనప్పటికీ అందరి పనితీరు ఒకేలా ఉండదు. మనలోని శక్తి, సామర్ధ్యం, ప్రతిభ, చురుకుదనం అనేవి పని విధానాలు మాత్రమే. ఇవన్నీ ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తుంటాయి. ఉదాహరణకు ఒక మొక్క గులాబీలను పూయిస్తే, ఇంకో మొక్క మల్లెలను పూయిస్తుంది. ఇలా ఒకే శక్తి పలు రూపాల్లో వ్యక్తమవుతుంది. మనల నిగూడమైన శక్తిపై కొంత ప్రావీణ్యం సంపాదిస్తే గనుక అసాధ్యం అనుకున్న పనులను.. సుసాధ్యం చేయగలము. శక్తి అనేది ఒక్కటే. ఉపయోగించేదానిని బట్టి ఫలితం ఉంటుందని అందరూ గమనించాలి. జీవితంలో అత్యుత్తమ దశకు చేరుకునే సాధనం యోగా అని నిపుణులు చెబుతున్నారు.