ఫుట్‌బాల్ ప్రపంచకప్ వచ్చిందంటే ఒక్కో జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది, వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని ఆంక్షలను కూడా ఎదుర్కొంటుంది…! తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్ సమరంలో సాధారణం…! అలా వారు విధించే ఆంక్షలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి .. అలాంటిదే ఇదే.
సాకర్ వరల్డ్ కప్ సందర్భంగా రష్యా మహిళలు శ్వేతజాతియేతర విదేశీయులతో శృంగారంలో పాల్గొనకూడదని ఆ దేశ ప్రజాప్రతినిధి ఒకరు సూచించారు. శ్వేతజాతియేతర విదేశీయులతో లైంగిక సంబంధం పెట్టుకుంటే.. మిశ్రమ జాతి (మిక్స్డ్ రేస్) పిల్లలతో సింగిల్ మదర్‌గా మహిళలు మిగిలిపోయే అవకాశముందని అన్నారు. రష్యా మహిళలు విదేశీయులతో చేసుకుంటున్న వివాహ సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని, రష్యా మహిళలు విదేశాల్లో చిక్కుకుపోవడం, లేదా వారు దేశంలో ఉంటే.. వారి పిల్లలు విదేశాల్లో ఉండటం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని సీనియర్ చట్టసభ సభ్యురాలు, కుటుంబ వ్యవహారాలు, మహిళా శిశు పార్లమెంటు కమిటీ చైర్మన్ తమరా ప్లెట్‌న్యోవా తెలిపారు.