ఎల్బీనగర్ నుండి అమీర్‌పేట్, మియాపూర్ వరకు మెట్రో రైలు ప్రారంభం గురించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. జూలై చివరి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిచే ప్రారంభించనున్నట్టు తెలిపారు. నాగోల్ నుండి ఫలక్‌నూమా వరకు మెట్రో రైలు నిర్మాణానికి పూర్తిస్థాయి ప్రాజెక్ట్ నివేదికను రూపొందిస్తున్నామని వెల్లడించారు. నగర శివార్లలో దీర్ఘకాలికంగా ఉన్న భూ సంబంధిత వివాదాల పరిష్కారానికి ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. నేడు ఎల్బీ నగర్ నియోజకవర్గ స్థాయి మన నగరం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వివరించారు.
see also:బీజేపీ నేతల మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసిన ఎంపీ కవిత
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతం అయ్యిందని, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని భూ రికార్డుల ప్రక్షాళన చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో మౌలిక సదుపాయాలు, పార్కులు, క్రీడామైదానాలు కల్పించే బాధ్యత జీహెచ్ఎంసీ చేపడుతోందని, అయితే వీటిని నిర్వహించే బాధ్యతను స్థానిక రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, కార్పొరేట్ సంస్థలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. అధికార వికేంద్రీకరణ ద్వారానే ఉత్తమ సేవలు అందించవచ్చని రాష్ట్ర ముఖ్య మంత్రి ఆలోచనలకు అనుగుణంగా జీహెచ్ఎంసీలో 50 డివిజన్లు, పది జోన్ల ఏర్పాటుకు సంబంధించి క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నామని కె.టి.రామారావు పేర్కొన్నారు. ఆస్తిపన్ను చెల్లింపు ద్వారానే అభివృద్ది పథకాల అమలు సాధ్యమని అంటూ ఆస్తిపన్ను తదితర పనులన్నింటిని సకాలంలో చెల్లించి సహకరించాలని మంత్రి కోరారు. సీనియర్ సిటీజన్లకు సౌకర్యార్థం జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న డే కేర్ సెంటర్ల నిర్వాహణకు అందిస్తున్న మూడు వేల రూపాయల గ్రాంట్‌ను రూ. 6వేలకు పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు.