శిరసుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి వ్రేళ్లలో వ్రేళ్లు పెట్టుకుని కాళ్లు రెండు క్రాస్ చేసుకుని కూర్చోవాలి. ఆ తరువాత రెండు కళ్లు మూసుకుని సహజంగా జరిగే ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను గమనించాలి. ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలు జరిగే సమయంలో ఎటువంటి నామస్మరణ కానీ, ఉచ్ఛరణ కానీ చేయకూడదు. ఏ దైవరూపాన్ని ఊహించకూడదు. మధ్య మధ్యలో అనేక ఆలోచనలు వచ్చినా.. వస్తున్నా కట్ చేస్తూ మీ ధ్యాసంతా ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసల మీదనే ఉంచాలి. ఆ తరువాత మెల మెల్లగా ధ్యానంలోకి స్థిరమైన స్థితికి చేరుకుంటారు. ఇదే ధ్యాన స్థితి.
అయితే, ధ్యానాన్ని ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా చేయవచ్చని వైద్యులు తెలుపుతున్నారు. ధ్యానం సైన్స్‌తో కూడుకున్నదని వైద్యులు చెబుతున్న మాట. యోగా చేసే సమయంలో.. యోగా మీద ధ్యాస పెట్టకుండా, అలాగే, సమస్యల గురించి ఆలోచిస్తూ, ఉచ్ఛ్వాస, నిచ్ఛ్వాసలను సరిగ్గా పాటించకుండా ఎటువంటి భంగిమలో యోగా చేసినా ఫలితం శూన్యమని వైద్యులతోపాటు నిపుణులు కూడా చెబుతున్న మాట.
ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలను, ప్రయోజనాలను వైద్యులు కింది విధంగా పేర్కొన్నారు :-
ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, సంకల్ప సిద్ధి, ఆత్మ విశ్వాసం, ఆత్మ స్థైర్యం, మానసిక ప్రశాంతత, గెలుపు ఓటముల మధ్య సమతుల్య అభిప్రాయం కలిగేలా యోగా ఆలోచనా శక్తిని పెంపొందిస్తుంది. నాడీ మండలం శుద్ధి జరిగి సపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. బీపీ, షుగర్, ఆస్తమా, స్పాండిలైటిస్, తలనొప్పి. కీళ్ల నొప్పులు, అల్సర్, క్యాన్సర్, గుండె జబ్బులను తగ్గించుకోవచ్చు. భయం, ఆందోళన, నిరాశ, అజ్ఞానం, ఆవేశం, మూర్ఖత్వం, జీవితంపట్ల విరక్తి, మూఢ నమ్మకాలు తొలగిపోయి జీవితాన్ని సాఫీగా సాగేలా ప్రతీ వ్యక్తిని యోగా ప్రభావితం చేయగలదని నిపుణులు అంటున్నారు