తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో నాలాల పూడిక పనులు మరింత ముమ్మరం చేయడంతో పాటు పురాతన శిథిల భవనాలు, నాలాలపై అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక పనులు, శిథిల భవనాల తొలగింపు, జవహర్‌నగర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ పనులపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జలమండలి, హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ట్రాఫిక్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్, కమిషనర్ జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
see also:సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. రుతుపవనాల ప్రభావంతో ఇప్పటికే నగరంలో వర్షాలు ప్రారంభం అయినందున నాలాల్లో పూడిక పనులు మరింత వేగవంతం చేయాలని అన్నారు. నాలాలపై అక్రమ నిర్మాణాలు, శిథిల భవనాల తొలగింపులో ఏవిధమైన అలసత్వం వహించవద్దని, ఈ విషయంలో ఎవరు అడ్డం వచ్చినా తగు కేసులు నమోదు చేయాలని స్పష్టం చేశారు. శిథిల భవనాలు, నాలాలు, చెరువులపై అక్రమ నిర్మాణాల తొలగింపు పురోగతి నిరుత్సాహకరంగా ఉందని, ఈ విషయంలో మరింత కఠినంగా,దూకుడుగా వెళ్లాలని టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అక్రమ నిర్మాణాల తొలగింపులో టౌన్‌ప్లానింగ్, విజిలెన్స్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలను ప్రాథమిక స్థాయిలోనే అడ్డుకోవాలని, ఒక సారి నిర్మితమైతే వాటిని తొలగించేందుకు సమస్యగా మారుతుందని అన్నారు. ఇప్పటికే గుర్తించిన ముంపు ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా చేపట్టిన పనులను పూర్తిచేయాలని అన్నారు. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో నగరవాసులకు ఏవిధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. నగరంలో చేపడుతున్న రోడ్ల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని, ఈవిషయంలో జోనల్ కమిషనర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదని మంత్రి స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ వినియోగంపై మంత్రి అసంతృప్తి..
జీహెచ్ఎంసీ కార్యాలయంలో వాటర్ బాటిళ్లు వాడడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 2022 నాటికి హైదరాబాద్ నగరంలో ఒక సారి వాడి పడేసే ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేదించాలని ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో నిర్ణయించినప్పటికీ తనకు వాడి పడేసిన ఖాళీ వాటర్ బాటిల్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో కనిపించాయని అన్నారు. ప్లాస్టిక్ వినియోగంపై కచ్చితంగా నిషేదాన్ని పాటించాలని జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీలో మరిన్ని సర్కిళ్లు
నగరవాసులకు మరింత మెరుగైన పౌర సేవలను కల్పించడానికి అధికార వికేంద్రీకరణ ద్వారానే సాధ్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారని, గ్రేటర్‌లో ప్రస్తుతం ఉన్న 30 సర్కిళ్లను 50 సర్కిళ్లుగా, ఆరు జోన్ల నుండి 10 జోన్లకు పెంచేందుకు తగు ప్రతిపాదనలు సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు. ఒక సర్కిల్‌లో కేవలం మూడు వార్డులు మాత్రమే ఉండేవిధంగా ప్రతిపాదించాలని సూచించారు. హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ఎస్.ఆర్.డి.పి, డబుల్ బెడ్‌రూం, రోడ్డు విస్తరణ పనులను చేపట్టినందున, వీటికి అవసరమైన భూసేకరణకు జీహెచ్ఎంసీలోనే ప్రత్యేకంగా భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేసే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లకు, ఇతర కలెక్టర్లు ఇతర పనులతో తీవ్ర ఒత్తిడితో ఉన్నందున జీహెచ్ఎంసీకి అవసరమైన భూసేకరణ అందించడానికి తగు సమయం కేటాయించలేకపోతున్నారని, ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీలో ప్రత్యేక భూసేకరణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో చేపట్టిన పూడిక పనులు, రోడ్ల నిర్మాణం, అక్రమ నిర్మాణాలు, శిథిల భవనాల తొలగింపు తదితర అంశాలను కమిషనర్ జనార్థన్‌రెడ్డి వివరించారు.