ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు. సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బాలకృష్ణ అల్లుడు. ఇవేనా..? అతను మంత్రి కావడానికి ఉన్న అర్హతలు, ఇంకే వద్దా..? మంత్రి పదవి అంటే.. అటెండర్ ఉద్యోగం అనుకుంటున్నారా..? ఎవరికి పడితే వారికి ఇవ్వడానికి. అందులోనూ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రం, మరో పక్క ఏపీకి నిధులు తెచ్చే ఐటీ, పంచాయతీరాజ్ శాఖలను అప్పగించారు. అతనికి ఏం అనుభవం ఉందని ఆ రెండు శాఖలను నారా లోకేష్‌కు కట్టబెట్టారు అంటూ ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
see also:వైఎస్ జగన్‌పై నటుడు పోసాని సంచలన వ్యాఖ్యలు..!
అయితే, ఇవాళ హైదరాబాద్ నగర పరిధిలోగల సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో పోసాని కృష్ణ మురళీ మాట్లాడుతూ ఏపీ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయ పార్టీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తను పోసాని ఖండించారు. రాజకీయంగా నాకు జగన్ అంటే ఇష్టం. అతను ఇప్పటి వరకు ఏ అబద్ధపు హామీ ఇవ్వలేదు. చంద్రబాబులా రైతు రుణ మాఫీ చేస్తా, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తా.. అంటూ అబద్ధపు హామీలు ఇవ్వలేకనే 2014లో కేవలం రెండు శాతం ఓట్లతో జగన్ ఓటమిని చవి ఊడాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు ఆ రెండు శాతం ఓట్లు కాస్తా 20 శాతం పెరిగి జగన్ గెలుపుకు కారణం కాబోతున్నాయని పోసాని కృష్ణ మురళీ జోస్యం చెప్పారు.