ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ప్రతీ జట్టు ప్రాణం పెట్టి పోరాడుతుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తుంది. తమ వ్యూహాలకు పదును పెడుతుంది..! తమ ఆకాంక్షను నెరవేర్చుకునేందుకు కొన్ని సవాళ్లను కూడా స్వీకరిస్తుంది. తమ ఆటగాళ్లు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఆయా జట్టు కోచ్‌లు నిక్కచ్చిగా చెప్పడం.. అమలయ్యేలా చూడడం సాకర్ సమరంలో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సాకర్‌లో కోచ్‌లదే ప్రధాన భూమిక. వారు చెప్పింది చెయ్యడమే ఆటగాళ్ల పని. అలా వారు విధించే ఆంక్షలు కొన్నిసార్లు ఆసక్తిని కలిగిస్తాయి. ఈసారి నైజీరియా కోచ్ గెర్నోట్ రోర్ తమ ఆటగాళ్లకు అలాంటి షరతునే విధించాడు. వరల్డ్‌క్‌పలో పాల్గొనేందుకు రష్యా వచ్చిన ప్లేయర్లు స్థానిక అమ్మాయిలను కలవ కూడదని, వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ శృంగారంలో పాల్గొనకూడదని ఆదేశించాడు.
అయితే, టోర్నీ అయ్యేంత వరకూ ఆటగాళ్లు శృంగారానికి దూరంగా ఉండాలని మాత్రం అతను చెప్పలేదు. కేవలం రష్యా అమ్మాయిల జోలికెళ్లొద్దన్నాడు. ప్లేయర్లు తమ భార్యలను, ప్రియురాళ్లను వెంట తెచ్చుకోవచ్చన్నాడు. మ్యాచ్ ప్రాక్టీస్, మ్యాచ్‌లు లేని రోజుల్లో వారితో గడిపేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆటగాళ్లు రష్యన్లకు దూరంగా ఉండాలని చెప్పడానికి కారణం లేకపోలేదు. కొందరు అమ్మాయిలు, వ్యభిచారులు తమ అందాలతో వల విసిరి తర్వాత బ్లాక్‌మెయిల్ చేస్తారని భద్రతా సిబ్బంది హెచ్చరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు.